ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారం చేపట్టిన నాలుగేళ్లలో పథకాల అమలుతో పాటు అన్ని రంగాల్లో విఫలమైందని, అవినీతిలో మాత్రం నూటికి నూరు మార్కులు సాధించి పాసైందని వైసీపీ నిడదవోలు నియోజకవర్గ సమన్వయకర్త జి.శ్రీనివాసనాయుడు ధ్వజమెత్తారు. ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం నిడదవోలు చేరుకోగా భారీ బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ టీడీపీ నాయకులు దొంగల్లా దోచుకుంటున్నారని విమర్శించారు. ఇసుక, మట్టి మాఫియా నియోజకవర్గంలో చెలరేగిపోతుందన్నారు. దోచుకో దాచుకో అనే చందంగా టీడీపీ నాయకులు ఇసుకతో పాటు మట్టిని కూడా వదలడం లేదన్నారు. ప్రతి దాంట్లో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో సంక్షేమ పధకాలను సైతం పేదలకు అందనివ్వడం లేదన్నారు. టీడీపీ గత ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చి మాటతప్పిందన్నారు. ప్రత్యేక హోదా సాధన, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు ఏపీ ప్రజలు తగిన బుద్ది చెబుతారని…వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేస్తామని వైసీపీ నేతలు ,కార్యకర్తలు అంటున్నారు.