తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులు, నీటి పారుదల విషయంలో.. విశేష అనుభవంతో సోషల్ ఇంజినీర్ గా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు . ఈ రోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఖైరతాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ కార్యాలయంలో నాలుగేళ్ల ప్రగతి-ప్రాజెక్టులో సాగునీటి నిర్వహణపై రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ హాజరై మాట్లాడారు.
ప్రాజెక్టుల కింద చివరి ఆయకట్టుకు నీరందించటమే తమ లక్ష్యమన్నారు. నీటిపారుదలశాఖ ఇంజనీర్లు, సిబ్బంది మంచి పనితీరు కనబరుస్తున్నారని అభినందించారు.ప్రాజెక్టుల కింద చుక్క నీరు వృధా కాకుండా చూస్తున్నామన్నారు. గతంలో ప్రాజెక్టుల కింద నీటి విడుదల కోసం ధర్నాలు, రాస్తారోకోలు జరిగేవని.. అయితే ఈ నాలుగేళ్లలో ధర్నాలు, దరఖాస్తులు లేకుండా నీరిచ్చామని చెప్పారు. ఈ ఏడాదిలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 24 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందిందన్నారు. 60ఏండ్లలో సాధించనిది ఐదేండ్లలో సాధిస్తున్నామని తెలిపారు. మిషన్ కాకతీయ అద్భుతమైన పథకమని చెప్పిన హరీష్.. దేశవ్యాప్తంగా మిషన్ కాకతీయకు ప్రశంసలు వచ్చాయన్నారు.