ఏపీలో ఇటీవల కాలంలో భూ కబ్జాలు ఎక్కువ అయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతకాలం క్రితం వైజాగ్ లో భూముల కబ్జాలపై ఏపీ అధికారపక్ష నేతల మధ్యన జరిగిన వాదనను మర్చిపోలేం. అధికారపక్షానికి చెందిన నేతలు విశాఖలో కబ్జాలకు నువ్వు కారణం అంటే నువ్వే కారణమని బాహాటంగా విమర్శలు చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించిన నటి అపూర్వకు చెందిన భూమిని కబ్జాకు ప్రయత్నిస్తున్నారన్న ఫిర్యాదు ఇప్పుడు సంచలనంగా మారింది. తన వ్యవసాయ భూమిని కబ్జా చేశారంటూ అపూర్వ పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, దెందులూరులో తనకు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉందని తెలిపారు. ఇటీవలే తమ భూమిని సర్వేయర్ తో సర్వే చేయించి సరిహద్దుల్లో రాళ్లు పాతించామని చెప్పారు. మరుసటి రోజే చుట్టు పక్కల ఉన్న రైతులు ఆ రాళ్లను తొలగించి, భూమిని ఆక్రమించారని తెలిపారు. ఈ కబ్జా వ్యవహారంపై పోలీసులు మాట్లాడుతూ, ఇది సివిల్ వ్యవహారమని, భూమి సరిహద్దుల విషయాన్ని ఎమ్మార్వో చూసుకుంటారని చెప్పారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి, సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.
see also…