ఆంధ్రప్రదేశ్ లో ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కు స్నేహ హస్తం అందించాలని ప్రయత్నిస్తుంటే, ఎపిసిసి అద్యక్షుడు రఘువీరారెడ్డి మాత్రం చంద్రబాబు నాలుగళ్ల పాలనపై చార్జీషీట్ విడుదలకు సిద్దమవుతున్నారు.ప్రతి సంవత్సరం జూన్ మొదటి వారంలో నవనిర్మాణ దీక్షల పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోన్న ముఖ్యమంత్రి, రాష్ట్ర అవతరణ దినోత్సవం మాత్రం చేయడం లేదని రఘువీరా ఒక ప్రకటనలో ద్వజమెత్తారు. నాలుగేళ్లుగా జూన్ 2 వచ్చిందంటే ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ‘అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారని పదే పదే చెబుతున్నావ్.. విభజన సమయంలో రెండుసార్లు పాలిట్‌బ్యూరో సమావేశం పెట్టావ్.. కేంద్ర హోంశాఖ ఏమి కావాలో చెప్పాలని అడిగితే సమన్యాయం అని లేఖ ఇచ్చావ్.. రాష్ట్రానికి ఇది కావాలి అని అసలైన శాస్త్రీయత గురించి ఎందుకు అడగలేదు’ అని ఆయన అన్నారు. జూన్ 8 నుంచి 15 వరకూ అన్ని మండల కేంద్రాల్లో ‘ప్రజా వంచన వారం’ నిర్వహిస్తామని ఆయన అన్నారు.
