హైదరాబాద్ సూర్యాపేట ప్రధాన రహదారిపై ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాద ఘటనలు పెరిగిపోయాయి.తాజాగా సూర్యాపేట జిల్లాలోని కోదాడ మండలం కోమరబండలో ఈ రోజు ( సోమవారం )ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.హైదరాబాద్ నుంచి రావులపాలెం వెళ్తున్న ఓ కారు.. కోమరబండ బైపాస్ వద్ద ఆగి ఉన్న లారీని వేగంగా దూసుకొచ్చి వెనక నుంచి ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వారు సత్యనారాయణ(35), మాధురి(21)గా గుర్తించారు.