‘కొత్తబంగారు లోకం’సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి శ్వేతా బసు ప్రసాద్. ఆ తర్వాత ‘కళావర్ కింగ్’, ‘రైడ్’, ‘కాస్కో’ తదితర చిత్రాల్లో నటించారు. కొన్ని కారణాల వల్ల శ్వేత జీవితం ఒడుదొడుకులతో సాగింది. కొన్నాళ్ల తర్వాత హిందీ సినిమాల్లో, సీరియళ్లలో నటించారు. అయితే ఇప్పుడు శ్వేత ఓ ఇంటివారు కాబోతున్నారు. బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్‌ను వివాహం చేసుకోబోతున్నారు.
కొన్ని రోజుల క్రితమే నిశ్చితార్థం జరిగినట్లు శ్వేత తాజాగా మీడియా ద్వారా వెల్లడించారు. ‘అబ్బాయిలే పెళ్లి ప్రస్తావన తెచ్చే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు అమ్మాయిలే అబ్బాయిలకు ప్రపోజ్ చేస్తున్నారు. నేను రోహిత్‌కు గోవాలో ప్రపోజ్ చేశాను. ఆ తర్వాత అతను పుణెలో నా ప్రేమను అంగీకరించాడు. ఇంట్లో వారూ ఒప్పుకొన్నారు. కానీ ఇప్పుడైతే పెళ్లికి తొందరేం లేదు. ఇటీవల మా ఇద్దరి నిశ్చితార్థం జరిగిన మాట నిజమే. మా ఇద్దరి జీవితాలకు సంబంధించిన విషయాలు బయటికి చెప్పుకోవాలని అనుకోవడం లేదు.’ అని వెల్లడించారు శ్వేత. ప్రస్తుతం శ్వేత తెలుగులో ‘గ్యాంగ్‌స్టర్స్’ అనే ‘వెబ్ సిరీస్’లో నటిస్తున్నారు. బాలీవుడ్‌లోనూ ఓ చిత్రంలో నటిస్తున్నారు.