తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని పరేడ్ గ్రౌండ్ లో జరిగిన తెలంగాణ రాష్ర్టావతరణ వేడుకల సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..ఉమ్మడి రాష్ర్టంలో కుదేలైన వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.”గ్రామీణ ఆర్థికవ్యవస్థ బాగుంటేనే వివిధ వృత్తులను నమ్ముకొని జీవించే ప్రజానీకానికి చేతినిండాపని, కడుపునిండా అన్నం దొరుకుతుంది. వ్యవసాయ రంగం, వృత్తి పనులు బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటుందని నా ప్రగాఢ విశ్వాసం. ఉమ్మడి రాష్ట్రంలో కుదేలైన వ్యవసాయరంగాన్ని, వృత్తి పనులను తిరిగి నిలబెట్టేందుకు ప్రభుత్వం సమగ్ర దృక్పథంతో ప్రణాళికలు రచించి, అమలు చేస్తున్నది. దశల వారీగా వివిధ పథకాలను అమలు చేస్తూ వస్తున్నది.
రైతు రుణాల మాఫీ, సకాలంలో ఎరువులు-విత్తనాల సరఫరా, ఐదువేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారి నియామకం, డ్రిప్ ఇరిగేషన్ కు– పాలీ హౌజ్ లకు, యంత్ర పరికరాలకు భారీ సబ్సిడీలు ఇవ్వడం, పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణం, రైతన్నలు చెల్సించాల్సిన నీటి తీరువా బకాయిల రద్దు, వ్యవసాయ ట్రాక్టర్లపై రవాణాపన్ను రద్దు, తదితర కార్యక్రమాల ద్వారా వ్యవసాయ రంగానికి కొత్త ఉత్తేజాన్ని కలిగించాం. సమైక్య రాష్ట్రంలో కరెంటు లేక రైతులు అనుభవించిన కష్టాలకు తెలంగాణ రాష్ట్రంలో చరమగీతం పాడాం. ఒకప్పుడు కరెంటు ఉంటే వార్త, నేడు కరెంటు పోతే వార్త అనుకునే స్థాయికి విద్యుత్ రంగాన్ని తీసుకురాగలిగాం. 24 గంటల పాటు నాణ్యమైన నిరంతర ఉచిత విద్యుత్ సరఫరాతో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగినయి. రైతుల జీవితాల్లో ఆనందపు వెలుగులు నిండినయి.
సమైక్య రాష్ట్రంలో సాగునీటి విషయంలో జరిగిన అన్యాయాన్ని సవరించి, గోదావరి, కృష్ణ నదీజలాలను తెలంగాణ పొలాలకు తరలించే విధంగా రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నది. ఏది ఏమైనా సరే తెలంగాణ రైతులు కన్న కలలు నిజం చేయాదానికి ప్రభుత్వం నడుం కట్టింది. తెలంగాణ వ్యాప్తంగా కోటి ఎకరాలకు సాగునీరు అందించి తీరాలనే దృఢ సంకల్పంతో ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా కొనసాగిస్తున్నది.
సమైక్య రాష్ట్ర పాలకులకు తెలంగాణ ప్రజలను భ్రమ పెట్టి పబ్బం గడుపుకోవాలనే దురాలోచననే తప్ప, నిజంగా తెలంగాణకు ప్రాజెక్టులు నిర్మించాలనే ఉద్దేశ్యమెన్నడూ లేదు. ప్రాజెక్టు స్థలం ఎంపిక దగ్గరనే వారి కుట్ర ప్రారంభమవుతుంది. అంతర్రాష్ట్ర వివాదాలకు ఆస్కారం కల్పించే విధంగా డిజైన్ చేసి, తర్వాత ఆ వివాదలనే సాకుగా చూపించి ప్రాజెక్టులు నిర్మించలేదు. అదేమిటంటే నెపం పక్క రాష్ట్రం నెత్తిన వేయడం, ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తలు రెచ్చగొట్టడం అనే పన్నాగాన్ని అమలు చేసారు. ఈ విధంగా సమైక్య పాలకులు తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొడుతుంటే తెలంగాణ నాయకులు తమ చేతకానితనాన్ని ప్రదర్శించారే తప్ప, ఎన్నడూ ఎదురు తిరిగి ప్రశ్నించలేదు. అందుకే ప్రభుత్వం సమైక్య పాలకులు చేసిన ప్రాజెక్టుల డిజైన్లను తెలంగాణ అవసరాలకు తగిన విధంగా రీ డిజైన్ చేయవలసి వచ్చింది” అని అన్నారు .