తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర అనిర్వచనీయమని రాష్ట్ర గృహ నిర్మాణ,న్యాయ,దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేసి న్యాయవాదులు ఎన్నో లాఠీ దెబ్బలు తిన్నారని.. ఉద్యమానికి వారి చేసిన సేవలు ఆమోఘమని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినట్లుగానే… తెలంగాణ పునర్నిర్మాణంలో న్యాయవాదులందరూ భాగస్వాములు కావాలని పిలుపినిచ్చారు. తెలంగాణ న్యాయవాదులకు హెల్త్‌కార్డులు, ప్రమాదబీమాతోపాటు ఆర్థికసహాయం, ఇతర పథకాలను శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ బీ వినోద్‌కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా న్యాయవాదులకు ఆరోగ్య బీమా కార్డులను, బార్ అసోసియేషన్లకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్ రావు, అదనపు అడ్వేకేట్ జనరల్ రామచంద్ర రావు, న్యాయ శాఖ అదనపు కార్యదర్శి బాచిన రామాంజనేయులు, ట్రస్ట్ సభ్యులు గండ్ర మోహన్ రావు ,సహోదర రెడ్డి, మానిక్ ప్రభు, రాజేందర్ రెడ్డి, మహమూద్ అలీ, పల్లె నాగేశ్వర్ రావు , జ్యోతికిరణ్, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… న్యాయవాదుల పోరాట స్పూర్తిని గుర్తించిన మన ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు గారు దేశంలో ఎక్కడ లేని విధంగా న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్లను కేటాయించారన్నారు. సీయం కేసీఆర్ ఆలోచన మేరకు తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పలుమార్లు ట్రస్ట్ భేటీయై న్యాయవాదుల సంక్షేమం కోసం ఏం చేస్తే బాగుంటుందో అని సమగ్రంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని వెల్లడించారు. 18 వేల మంది న్యాయవాదులు, వారి జీవిత భాగస్వాములకు కలిపి మొత్తం 36 వేల మందికి రూ.2 లక్షల మేరకు ఆరోగ్య బీమా పథకం వర్తింపజేస్తున్నామన్నారు. ప్రమాదంలో మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు ప్రమాద బీమా పథకం కింద రూ.10 లక్షల ఆర్థిక సహాయం ఇస్తామన్నారు. ఆయా జిల్లాల్లోని బార్ అసోసియేషన్లకు మెరుగైన వసతుల కల్పన పర్నీచర్, లైబ్రరీ,ఇతర నిర్వహణ ఖర్చుల కోసం న్యాయవాదుల సంఖ్యను బట్టి రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. జూనియర్ న్యాయవాదులకు వన్ టైమ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద (2 సంవత్సరాల నుంచి 5 ఏళ్ల స్టాండింగ్ ఉన్న వారికి ) ఆఫీసు, లైబ్రరీ ఏర్పాటు కోసం రూ.10 వేల ఆర్థిక సాయం ఇవ్వడం జరుగుతుందన్నారు. జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ విషయంలో సాధ్యసాధ్యాలను పరిశీలించి, సీయం కేసీఆర్ తో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు.