తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను అందమైన, ఆరోగ్యవంత రాజధానిగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు . ఇందుకోసం అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకుంటామన్నారు. ప్రపంచ పర్యావరణ ఉత్సవాల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్ హెమ్ తో కలిసి మంత్రి కేటీయార్ నగర శివారులో ఆటవీ శాఖ అభివృద్ది చేసిన భాగ్యనగర్ సందనవనం ఫారెస్ట్ అర్బన్ పార్క్ ను సందర్శించారు.
తెలంగాణకు హరితహారం లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై అటవీ శాఖ ఉన్నతాధికారులు ఈ సందర్భంగా వివరించారు. అటవీ శాఖ అధికారులతో కలిసి భాగ్యనగర్ నందనవనంలో ఇద్దరు ప్రముఖులు కలియతిరిగారు. పార్కులో చేపట్టిన మొక్కల పెంపకం, పర్యావరణ ప్రదర్శన శాల, వాచ్ టవర్, కనోపి వాక్ లను ఎరిక్, కేటీఆర్ పరిశీలించారు. స్వయంగా ఇద్దరూ కలిసి మొక్కలను పార్కులో నాటారు. కేబీయార్ పార్కు లో ఉన్న మొక్కలు, పూల సమాహారంతో తయారు చేసిన ద ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ కేబీయార్ నేషనల్ పార్క్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం విశిష్టతలు, అటవీ విస్తీర్ణం, పర్యావరణం కోసం చేపట్టిన కార్యక్రమాలను మంత్రి కేటీయార్ స్వయంగా ఎరిక్ సోల్ హెమ్ కు వివరించారు. హెచ్ఎండీఏ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో చేపట్టిన అర్బన్ ఫారెస్ట్ పార్కుల గురించి తెలిపారు. రెండేళ్ల వ్యవధిలో మరో యాభైకి పైగా పార్కులను ప్రజలకు అందుబాటు లోకి తీసుకువస్తున్నట్లు, అన్ని చెరువులు, సరస్సుల రక్షణ కోసం చేపట్టిన చర్యలను మ్యాపుల సహాయంతో వివరించారు.
అటవీ శాఖ తరపున ప్రభుత్వం చేపట్టిన హరితహారం, అర్భన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ది, ఎవెన్యూ ప్లాంటెషన్ (రహదారి వనాలు), అటవీ పునరుద్ధరణ పనులను ఉన్నతాధికారులు ఏరిక్ కు తెలిపారు. పర్యావరణ రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ఐక్యరాజ్య సమితి ప్రతినిధి ప్రశంసించారు. తెలంగాణకు హరితహారం ఇతర ప్రాంతాలకూ ఆదర్శనీయం అన్నారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం నుంచి అన్ని రకాలుగా తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి కేటీయార్ , ఎరిక్ ను కోరారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించటం, పర్యావరణ పరంగా ప్రతీ పౌరుడు బాధ్యతాయుతంగా ఉన్నప్పుడే కాలుష్య నియంత్రణ సాధ్యమవుతుందిని ఎరిక్ అభిప్రాయపడ్డారు. వీటిపై ప్రపంచ వ్యాప్తంగా అందరిలో అవగాహన కల్పించేందుకు తమ సంస్థ తరుపున ప్రయత్నిస్తున్నామని ఎరిక్ తెలిపారు. సాంప్రదాయేతర ఇంధన వనరులవైపు మళ్లటం ద్వారా కాలుష్యాన్ని తగ్గించటంతో పాటు, అందుబాటులో ఉన్న వనరులు హరించుకు పోకుండా కాపాడుకోగలమన్నారు. నందన వనం పార్క్ లో విరివిగా ఉన్న వేప చెట్ల విశిష్టతను అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా ఎరిక్ కు వివరించారు.
వందల ఏళ్లుగా వేప పుల్ల ను పళ్లు శుభ్రం చేసేందుకు భారతీయులు వాడుతున్నారని, అలాగే అనేక ఔషధాల తయారీకి కూడా వేప ఉత్పత్తులు ఉపయోగపడతాయని మంత్రి కేటీయర్ ఈ సందర్భంగా ఎరిక్ కు తెలిపారు. దాదాపు గంటన్నర పాటు పార్క్ లో కలియ తిరిగిన ఎరిక్ , కేటీయార్ అటవీ శాఖ అధికారులను ప్రశంసించారు. ఫారెస్క్ పార్కు నిర్వహణ బాగుందని, సందర్శకులకు కల్పించిన ఏర్పాట్లపై కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఏర్పాటయ్యే కొత్త అర్బన్ ఫారెస్ట్ పార్కులు నగరాల్లో నివసించే పౌరులకు మంచి వాతావరణం, అహ్లాదాన్ని పంచేలా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అటవీ సంరక్షణ అధికారి పీ.కే.ఝా, అదనపు అటవీ సంరక్షణ అధికారులు లోకేష్ జైస్వాల్, ఆర్.ఎం. డోబ్రియల్, చంద్రశేఖర రెడ్డి, మేడ్చల్ అటవీ అధికారి సుధాకర్ రెడ్డి లు పాల్గొన్నారు.