అంతర్జాతీయంగా ఖ్యాతి పొందుతున్నహైదరాబాద్ ను మరింత ఉన్నత జీవన ప్రమాణాలు ఉన్న నగరంగా మార్చాలనేది తెలంగాణ ప్రభుత్వ ఆశయమని చీఫ్ సెక్రటరీ ఎస్.కే.జోషి అన్నారు. దీనిలో భాగంగానే ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు పట్టణ ప్రాంతాల అటవీ ఉద్యానవనాలు ( అర్బన్ ఫారెస్ట్ పార్క్ లు) నెలకొల్పుతున్నట్లు సీ.ఎస్ తెలిపారు. అర్బన్ ఫారెస్ట్ పార్కుల కోసం చీఫ్ సెక్రటరీ అధ్యతన ఏర్పాటైన హై పవర్ కమిటీ మొదటి సమావేశం ఇవాళ సచివాలయంలో జరిగింది. వివిధ డిపార్ట్ మెంట్లకు కేటాయించిన పార్కుల అభివృద్ది, వాటికి అవసరమైన ఆర్థిక వనరులపై ప్రధానంగా చర్చ జరిగింది.
మొదటి దశలో హెచ్ ఎం డీ ఏ పరిధిలో 59 పార్కుల అభివృద్ది జరగనుంది. అటవీ శాఖ 15, హెచ్ఎండీఏ 17, జీహెచ్ఎంసీ 3, టీఎస్ఐఐసీ 11, ఫారెస్ట్ కార్పోరేషన్ 4, మెట్రో రైల్ 2, టూరిజం 7 పార్కులను అభివృద్ది చేయనున్నాయి. వీటిని స్పష్టమైన లక్ష్యాలు పెట్టుకుని పూర్తి చేయాలని, పనులంతా పర్యావరణ హితంగా జరగాలని సీ.ఎస్ ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటూ ఆరోగ్యం, అహ్లాదం కోరుకునే ప్రజలకు ఈ పార్కులు ఉపయోగపడాలన్నారు. సామాజిక బాధ్యతగా అర్బన్ పార్కులను అభివృద్ది పరిచేందుకు ముందుకు వచ్చే కార్పోరేట్ సంస్థలను కూడా ప్రోత్సహించాలని సమావేశంలో నిర్ణయించారు.
హైదరాబాద్ చుట్టూ ఏడు జిల్లాల పరిధిలో ఈ పార్కుల అభివృద్ది జరుగుతున్నందున వెంటనే ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లా అటవీ అధికారి, సంబంధిత శాఖల అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి, వెంటనే పనులు ప్రారంభించాలని సీ.ఎస్ ఆదేశించారు. సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, సీ.ఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, పీసీసీఎఫ్ పీ.కె.ఝా, అటవీ అభివృద్ది కార్పోరేషన్ ఎం.డీ. చందన్ మిత్రా, అదనపు అటవీ సంరక్షణ అధికారి ఆర్.ఎం.డోబ్రియల్, టూరిజం కమిషనర్ సునీతా భగవత్, టీఎస్ఐఐసీ ఎం.డీ. నర్సింహారెడ్డి, ఆర్థిక, మున్సిపల్, ఈటీపీఆర్ఐ శాఖల అధికారులు పాల్గొన్నారు.