ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల మద్దతును చూరగొంటోంది. అంతేకాకుండా, జగన్ తన పాదయాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా ఆ ప్రాంత ప్రజలంతా వారి వారి సమస్యలను అర్జీల రూపంలో తెలుపుకుంటున్నారు. చిన్నారుల నుంచి.. వృద్ధుల వరకు ఇదే తీరు. వృద్ధులయితే తమకు ఫించన్ రూపంలో వచ్చే డబ్బులను కూడా జన్మభూమి కమిటీలు వదలడం లేదని, ఆ డబ్బుల్లో కూడా వసూళ్లకు పాల్పడుతున్నారంటూ జగన్‌కు చెప్పుకుని తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులు అయితే చంద్రబాబు సర్కార్ ఇప్పటి వరకు ఉద్యోగాల నోటిఫికేషన్ వదల్లేదని, రైతులయితే, తమకు ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదని, డ్వాక్రా రుణాలు ఇప్పటి వరకు మాఫీ కాలేదని మహిళలు ఇలా ప్రతీ ఒక్కరూ చంద్రబాబు సర్కార్ ఇచ్చిన హామీలను జగన్‌కు చెప్తూ.. ప్రభుత్వం చేస్తున్న దాడులను సైతం జగన్‌కు వివరిస్తున్నారు.
అయితే, జగన్ ప్రజా సంకల్ప యాత్ర పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో జగన్‌ను పలుకరించేందుకు ఓ కురు వృద్ధురాలు అటుగా వచ్చింది. తనకు ఫించన్ తీసుకునే వయసు ఉన్నా.. చంద్రబాబు సర్కార్ తనకు పింఛన్ మంజూరు చేయలేదని, తనకు పింఛన్ మంజూరు అయ్యే వయస్సు లేదంటూ జన్మభూమి కమిటీలు రికార్డుల్లో రాసుకున్నారని, ఆ విషయం తనను ఎంతో బాధించిందన్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఆ వృద్ధురాలు జగన్‌కు చెప్పుకుని కన్నీరు మున్నీరైంది. వెంటనే స్పందించిన జగన్ రానున్న రోజుల్లో మనకు అంతా మంచే జరుగుతుందని భరోసా ఇచ్చి ఆ వృద్ధురాలిని ఓదార్చారు.
అయితే, జగన్‌ను చూడాలన్న ఏమరపాటులో మండుటెండను సైతం లెక్క చేయకుండా ఆ వృద్ధురాలు చెప్పులు లేకుండానే వచ్చింది. దీన్ని గమనించిన జగన్ ఆ వృద్ధురాలికి చెప్పులు తొడిగారు. ఇలా జగన్ చేసిన మంచి పనికి అక్కడి వారంతా హర్షించారు. జగన్ రాజకీయ నాయకుడు కాదు.. జన నాయకుడు అంటూ నినాదాలు చేయసాగారు.