వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్రజలు జగన్ అడుగులో అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు సర్కార్ పరిష్కరించని తమ ప్రాంత సమస్యలను జగన్‌తో చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సర్కార్ పేరు చెప్పుకుని టీడీపీ కార్యకర్తల నుంచి నేతల వరకు తమపై దాడులు చేస్తున్నారని, అలాగే, జన్మభూమి కమిటీలంటూ తమపై వేధింపులకు పాల్పడుతున్నారంటూ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న జగన్‌కు ప్రజలు చెప్పుకుంటున్నారు. వాటన్నిటిని సానుకూల ధృక్పథంతో విన్న వైఎస్ జగన్ సమస్యలపై అర్జీలను తీసుకుని, వైసీపీ అధికారంలోకి రాగానే దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు.
అయితే, వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో పూర్తి చేసుకుని.. పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వేసవి కాలం దృష్ట్యా ఎండ వేడిమి 40 నుంచి 50 డిగ్రీల వరకు పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, వైఎస్ జగన్ మాత్రం ఎండను సైతం లెక్క చేయకుండా తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఒక పక్క మండుటెండలు, మరో పక్క వడగాల్పులు అయినా వాటన్నిటినీ లెక్క చేయకుండా జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు వైఎస్ జగన్ పాదయాత్రతో 2వేల పై చిలుకు కిలోమీటర్లు నడిచిన విషయం తెలిసిందే. మరో వెయ్యి కిలో మీటర్లు నడిచి ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించే దిశగా జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు.