2014లో అతి తెలివితో రాష్ట్ర విభజన చేసి తెలంగాణలో తెరాస సహకారంతో, ఆంధ్రప్రదేశ్‌లో వైకాపాను లొంగదీసుకుని రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి రావొచ్చు అని మెరుపు కలలు కని బొక్కబోర్లాపడ్డ కాంగ్రెస్ తెలంగాణలో ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చే అవకాశమే లేకుండా పోయింది. అధికారం సంగతి సరే కనీసం డిపాజిట్ తెచ్చుకునేంత బలం కూడా లేదు. కాంగ్రెస్‌లో మిగిలింది చిరంజీవి కాక, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రఘువీరారెడ్డి. అందులోను చిరంజీవి సుఖంగా సినిమాలు చేసుకుంటుండగా రఘువీరారెడ్డి మాత్రం ఎప్పుడన్నా ఒకసారి జనంలోకి వస్తూ అప్పుడప్పుడూ చంద్రబాబును విమర్శించే వారు. అలాంటిది మధ్యలో కొన్ని రోజులు కనబడకుండా పోయారు.
అయితే, రఘువీరారెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని, ఆ క్రమంలోనే కొద్దిమంది మధ్య వర్తులతో రఘువీరారెడ్డి జగన్‌తో మంతనాలు చేయిస్తున్నట్లు సమాచారం. మొదట్నుంచి వైఎస్ఆర్, జగన్‌లతో సన్నిహితంగా మెలిగిన రఘువీరారెడ్డి వైసీపీలో చేరి హిందూపురం ఎంపీగా పోటీ చేసేందుకు ఆశపడుతున్నారు. చంద్రబాబు రాహుల్ గాంధీకి దగ్గర అవ్వాలని చూడటం, అందుకు రాహుల్ గాంధీ సుముఖంగా ఉండటం, రాష్ట్ర విభజన ద్వారా అన్యాయం చేసిన కాంగ్రెస్ ఏపీలో ఇక బతికి బట్టకట్టడం కష్టమేనని లేటుగా గ్రహించిన రఘువీరారెడ్డి వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారట. ఈ విషయాన్ని వైసీపీ శ్రేణులు ధృవీకరించాల్సి ఉంది.