వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర అన్నివర్గాల ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, వైఎస్ జగన్ పాదయాత్ర ఇప్పటికే (కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి) ఎనిమిది జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది.
ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా వైఎస్ జగన్‌కు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వారు పడుతున్న సాధకబాధలను వైఎస్ జగన్‌కు చెప్పుకుంటున్నారు. వైఎస్ జగన్ మాత్రం సమస్యల పరిష్కరానికి సరైన మార్గాలను చెబుతూ వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు. ఇలా జగన్ తన పాదయాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా సీఎం.. సీఎం అంటూ ప్రజలు నినాదాలు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా.. ఒక సంకల్పంతో పాదయాత్ర చేస్తున్న జగన్‌కు అన్నివర్గాల ప్రజలు నుంచి మద్దతు లభిస్తోంది. అంతేకాకుండా, టాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం జగన్‌కు జై కొడుతున్నారు. ఒకటి రెండు రోజులు నడిస్తే.. మరో వారం రోజులపాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది.. అటువంటి వైఎస్ జగన్ ప్రజల సమస్యలపై పోరాడుతూ.. మూడు వేల కిలోమీర్లు పాదయాత్ర చేయడం గొప్ప విషయమంటూ జగన్‌పై టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అందులో భాగంగానే ఇటీవల కాలంలో పోసాని కృష్ణ మురళీ జగన్ పాదయాత్రలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సీనియర్ నటుడు, కమెడియన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న పృథ్వీ ఇవాళ జగన్ పాదయాత్రలో పాల్గొన్నారు. జగన్ వెంట నడిచారు. తనకు తెలిసిన, టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలను పృథ్వీ జగన్‌కు వివరించారు.