తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ,ఎస్టీలకు సంబంధించి పెండింగ్ అట్రాసిటీ కేసులపై జూన్ 6 లోగా తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి జిల్లా కలెక్టర్లు, ఎస్.పిలను ఆదేశించారు. ఈ రోజు సచివాలయంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ లతో అట్రాసిటి కేసులు, రైతుబంధు, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణి, జిల్లాలలో రాష్ట్ర అవతరణ వేడుకలపై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. జాతీయ ఎస్సీ ,ఎస్టీ కమీషన్ ఈ కేసులపై ప్రత్యేకంగా సమీక్షిస్తుందని, జిల్లా కలెక్టర్లు ,ఎస్పీలు ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటి కేసులపై ప్రత్యేకంగా సమీక్షించి, పెండింగ్ లో ఉన్నకేసులను సత్వరమే పరిష్కరించడంతో పాటు బాధితులకు వెంటనే నష్టపరిహారం అందేలా చూడాలన్నారు. ఎస్సీ ,ఎస్టీ కేసులపై జిల్లా స్ధాయిలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించి కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటి కేసులు సంభవించినప్పుడు జిల్లా కలెక్టర్లు, ఎస్,పిలు ప్రత్యక్షంగా పర్యటించాలని, ఈ కేసుల పరిహారపు చెల్లింపులు ట్రెజరీ కంట్రోల్స్ లేవని తెలిపారు.
రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 41,09,743 పాసుపుస్తకాలు పంపిణీ చేశామని, ధరణి వెబ్ సైట్ లో ఆధార్ సీడింగ్, డబుల్ ఖాతా, బ్యాక్ లాగ్ సక్సెస్ కరెక్షన్ మాడ్యూళ్ళను సిద్ధం చేశామని కలెక్టర్లకు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల వారిగా పనితీరును ప్రతి రోజు సమీక్షిస్తున్నారని, జూన్ 20 లోగా మిగిలిన పాసుపుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు.
రైతు బంధుకు సంబంధించి 45.13 లక్షల చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని ఆర్ ఓ ఎఫ్ ఆర్ కు సంబంధించి 47 వేల చెక్కులు పంపిణీ చేశామని వ్యవసాయశాఖ కమీషనర్ జగన్ మోహన్ తెలిపారు.
రాష్ట్ర అవతరణ వేడుకలను జిల్లాల్లో ఘనంగా నిర్వహించటానికి పకడ్భందీ చర్యలు చేపట్టాలని జిఏడి ముఖ్యకార్యదర్శి అధర్ సిన్హా జిల్లా కలెక్టర్లను కోరారు. వేడుకలను గత సంవత్సరం మాదిరిగానే నిర్వహించాలని ఇప్పటికే తగు మార్గదర్శకాలను జారీ చేసినట్లు ఆయన వివరించారు. జిల్లాలో సాధించిన ప్రగతి, అభివృద్ధి, రాష్ట్ర స్ధాయిలో చేపట్టిన ప్లాగ్ షిప్ కార్యక్రమాల వివరాలతో ప్రసంగాలను రూపొందించాలన్నారు. జిల్లా స్ధాయిలో ఉదయం వేడుకల నిర్వహణతో పాటు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.