గత కొద్ది రోజులుగా పడుతూ లేస్తూ వస్తున్న బంగారం ధర సోమవారం భారీగా తగ్గింది. భారతీయ విపణిలో పది గ్రాములు పసిడి రూ.405 తగ్గడం ద్వారా రూ.32వేల దిగువకు పడిపోయింది. సోమవారం నాటి బులియన్ ట్రేడింగ్‌లో స్వచ్ఛమైన 10గ్రాముల పసిడి రూ.31,965కు చేరింది. అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు లేకపోవడం, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ కొరవడటం వల్లే పసిడి ధర తగ్గిందని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి.
మరోపక్క వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. కిలో వెండి రూ.370 తగ్గడం ద్వారా రూ.41వేల మార్కును కోల్పోయి, రూ.40,830 పలుకుతోంది. అననుకూల అంతర్జాతీయ పరిణామాలు సెంటిమెంట్‌ను దెబ్బతీయడంతో బంగారం కొనుగోలుకు మదుపరులు అంతగా ఆసక్తి చూపలేదు. అంతర్జాతీయంగా 0.30శాతం తగ్గిన పసడి ధర ఔన్సు 1,296.20 డాలర్లుగా ఉంది. వెండి కూడా 0.36శాతం తగ్గి ఔన్సు 16.51డాలర్లకు చేరింది.