టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు,టాలీవుడ్ సీనియర్ నటుడు ,దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మరణానికి కారణం ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి ,టీడపీ అధినేత చంద్రబాబే అని టీడీపీ సీనియర్ నేత ,మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు స్పష్టం చేశారు.ఈ రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కంటతడి పెట్టారు.ఈ సందర్భంగా బాబుపై సంచలన వాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు తనను గవర్నర్ చేస్తానని.. ఆ తర్వాత రాజ్యసభకు పంపిస్తానని చెప్పి మోసం చేశారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు..బాబుకు అండగా ఉంటే ఇప్పుడు జరుగుతున్న తెలుగుదేశం మహానాడుకు సీనియర్ నేత అని కూడా పిలవకుండా తీవ్రంగా అవమానించారని బోరున విలపించారు. ఆ రోజుల్లో రాజకీయ కుట్రలకు ఎన్టీఆర్ కూడా బలయ్యారని తెలిపారు. తనకు ఎన్టీఆర్ రాజకీయ భిక్ష పెట్టారని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
చంద్రబాబు నాయుడు వల్లనే ఎన్టీఆర్ చనిపోయారని ఆయన వ్యాఖ్యానించారు.రాజ్యాధికారం కోసం పిల్లనిచ్చిన మామని చంపావు అని బాబుపై విరుచుకుపడ్డారు. టీడీపీ పార్టీ బాగుండాలి అంటే నందమూరి వారసులకు పార్టీని అప్పగించాలని మోత్కుపల్లి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా డిమాండ్ చేశారు.