తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరోమారు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన గులాబీదళపతి కేసీఆర్…ఆ ప్రకటన చేసిన తర్వాత మొట్టమొదటి ఢిల్లీకి వెళ్లారు. జోనల్ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడానికి ముఖ్యమంత్రి కేసీఆర్.. క్యాబినెట్ సమావేశం అనంతరం ఆదివారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లతో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉంది.
ఈ పర్యటన ఫెడరల్ ఫ్రెంట్‌లో కీలకంగా మారనుందని తెలుస్తోంది. నాలుగు రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్న సీఎం కేసీఆర్‌తో పలువురు ప్రముఖ నేతలు భేటీ కానున్నారని సమాచారం. ఇప్పటికే ఫ్రంట్‌లో కలిసి వచ్చేందుకు పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతాబెనర్జీ, డీఎంకే అధినేత స్టాలిన్, యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాది పార్టీ రథసారథి అఖిలేష్ యాదవ్, జేడీయూ నాయకులు దేవేగౌడ, కుమారస్వామి సమావేశం అయి అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా మరిన్ని కీలక సమావేశాలు జరగనున్నాయని అంటున్నాయి.