ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగేళ్ల నుంచి పోరాడుతోంది. టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాకు తూట్లు పొడవటానికి ప్రయత్నించినా ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తన పోరాట పఠిమతో ప్రత్యేక హోదా పోరాటాన్ని సజీవంగానే ఉంచారు. అధికార పార్టీ ప్రత్యేక హోదాపై రోజుకో మాట మాట్లాడుతున్నా.. ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ఒకే మాటపై నిలబడి నాలుగేళ్ల నుంచి పోరాడుతున్నారు. ప్రత్యేక హోదా కోసం ఎన్నో పోరాటాలు కూడా చేశారు.
అందులో భాగంగానే ప్రత్యేక హోదా కోసం పార్టీ ఆదేశాల మేరకు తమ ఎంపీ పదవులకు రాజీనామాలు చేసి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆరు రోజులపాటు నిరాహార దీక్ష చేశారు వైసీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, వరప్రసాద్, సుబ్బారెడ్డి. ఇప్పుడు తమ రాజీనామాలపై మేకపాటి స్పందించారు.
ఎంపీ మేకపాటి మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 29న సుమిత్రా మహాజన్‌ను కలుస్తామని, రాజీనామాలను ఆమోదించమని ఒత్తిడి తెస్తామని తెలిపారు. తమ రాజీనామాలను లోక్ సభ స్పీకర్ ఆమోదిస్తారనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్ ప్రత్యేక హోదా సాధన కోసం నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రం అభివృద్థి పథంలో నడవాలంటే ప్రత్యేక హోదానే మార్గం. ఏపీకి ప్రత్యేక హోదాను సాదించే వరకు తమ పోరాటం ఆగదని చెప్పారు మేకపాటి రాజమోహన్‌రెడ్డి.