రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఈ రోజు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ వీరందరికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ నల్గొండ జిల్లా విషయంలో కాంగ్రెస్ పార్టీకి అడుగో.. బొడుగో ఆశ ఉందని ఎద్దేవా చేశారు. ఇక్కడ నల్గొండ ప్రజలు ఒక విషయం అర్థం చేసుకోవాలని మంత్రి అన్నారు. కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయితీయగలడా? అని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి మంత్రి పంచ్ వేశారు. ప్రజలు దశాబ్దాలు అవకాశం ఇచ్చినా నల్గొండ జిల్లాను ఫ్లోరోసిస్‌కు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మార్చారని, నీటి సమస్య పరిష్కరించలేదని కాంగ్రెస్‌పై మంత్రి ధ్వజమెత్తారు.
సీఎం కేసీఆర్ పాలనలో నాలుగేళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. మహారాష్ట్రలోని 40 గ్రామాల ప్రజలు తెలంగాణ పథకాలు నచ్చి మమ్మల్ని తెలంగాణలో కలపండని తీర్మానాలు చేస్తున్నరు. మరోవైపు ఏపీలో కూడా టీఆర్‌ఎస్ శాఖ ఏర్పాటు చేయాలని అక్కడి సోదరులు కోరుతున్నరని పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, నల్లగొండ నియోజకవర్గ ఇంచార్జ్ కంచర్ల భూపాల్‌రెడ్డి, బండ నరేందర్‌రెడ్డి, తదితరులు హాజరయ్యారు.