మంత్రి కేటీఆర్ పనితీరు ఎలా ఉంటుందో తెలియజెప్పేందుకు ఇదో ఉదాహరణ. మాట ఇస్తే..అందుకు తగిన రీతిలో ఎంతగా శ్రమిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలా మంత్రి కేటీఆర్ చేసిన ఓ పనికి 86 ఏళ్ల బామ్మ ఫిదా అయింది. నిన్న జరిగిన మన నగరం కార్యక్రమంలో పాల్గొని మంత్రి కేటీ రామారావు దృష్టికి తన సమస్యను తీసుకొచ్చిన 86 ఏళ్ల శేషానవరత్నంకు 24 గంటల్లోనే పరిష్కారం లభించింది. నిన్న కూకట్ పల్లిలో జరిగిన మన నగరం కార్యక్రమానికి హాజరై హౌజింగ్ బోర్డ్ లో తాను నివాసం ఉంటున్న తన ఇంటి కింద అక్రమంగా వంట గదిని నిర్వహిస్తున్న కృతుంగా రెస్టారెంట్ పై ఫిర్యాదు చేసింది. కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ అక్రమ వంట గదితో పై అంతస్థులో ఉంటున్న తమ కుటుంబానికి ప్రమాదం ఉందని తెలిపింది. ఎలాంటి అనుమతులు లేకుండా కిచెన్ నిర్వహించడంతో పాటు కోర్టు కేసులతో తమను వేధిస్తున్నారని మంత్రికి విన్నవించుకుంది. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్, సమస్యను పరిష్కరించాలని అక్కడిక్కడే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
మంత్రి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన జిహెచ్ఎంసీ జోనల్ కమీషనర్లు హరిచందన, శంకరయ్య ఆధ్వర్యంలో అధికారుల బృందం ఈరోజు రెస్టారెంట్ ను తనిఖీ చేసింది. పైఅంతస్థులో ఉంటున్నవారికి ఇబ్బందులు కలిగించడంతో పాటు భారీ సిలిండర్లను వినియోగించడంతో పెను ప్రమాదానికి ఆస్కారం ఉందని గుర్తించింది. దీంతో పాటు రెస్టారెంట్‌కు ట్రేడ్ లైసెన్స్ తో పాటు ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు కూడా లేవని అధికారులు తెలుసుకున్నారు. దీంతో అక్రమంగా నడుస్తున్న వంటగదితో పాటు పరిసరాలను సీజ్ చేశారు. జిహెచ్ఎంసీ అధికారుల చర్యపై శేషానవరత్నం సంతోషం వ్యక్తం చేసింది. అక్రమ వంటగదిపై ఇప్పటికే అధికారులకు పలుసార్లు ఫిర్యాదు చేశామని, అయితే కోర్టు కేసు పేరు చెప్పి రెస్టారెంట్ నిర్వాహకులు వారిపైనా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారన్నారు.
అయితే నిన్నటి మన నగరం కార్యక్రమంలో మంత్రిని కలిసినప్పుడు ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపించి సమస్య పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ఎన్నో ఏళ్ల సమస్య ఇంత త్వరగా పరిష్కారం అవుతుందని అసలు ఊహించలేదని, ఇందుకు మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు అన్నారు శేషానవరత్నం. ప్రజాసమస్యల పరిష్కారానికి చిత్తశుద్దితో పనిచేస్తున్న కేటీఆర్ లాంటి నాయకుడు ప్రజాసేవలో కలకాలం కొనసాగాలని పెద్ద మనసుతో దీవించారు. ఇలాంటి నాయకుడు ప్రజాసేవలో కలకాలం కొనసాగాలని పెద్ద మనస్సుతో దీవించారు