సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ రాజీవ్ రహదారి పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు 5లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు.బాధకరమైన సంఘటన విషయం తెలియగానే.. సిద్ధిపేటలో ముఖ్య కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని హూటాహుటినా సంఘటన స్థలానికి మంత్రి హరీశ్ రావు బయలుదేరారు.సిద్ధిపేటలో ఇటీవల సౌత్ ఇండియాలోనే క్లీన్ పట్టణంగా ఖ్యాతి గడించిన సందర్భంగా మున్సిపల్ కార్మికులతో కలిసి సహపంక్తి భోజనాలు చేయాల్సి ఉంది., అలాగే రంజాన్ మాసం పురస్కరించుకుని ముస్లిం మైనారిటీ మతపెద్దలతో సమీక్షా సమావేశం నిర్వహించాల్సి ఉండటం, ఈ రోజున సిద్ధిపేటలో రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలు ప్రారంభమైన నేపథ్యంలో స్విమ్మింగ్ పోటీలలో గెలుపొందిన స్విమ్మర్లకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమాలలో పాల్గొనాల్సి ఉండగా., రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారిక యంత్రాంగంతో ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం సంభవించిన విషయాలు అడిగి తెలుసుకున్నారు. పరిసర ప్రాంతాలను చూసి.. ప్రాణాలు కోల్పోయిన మృత దేహాలను చూసి హృదయం కలిచివేసిందన్నారు. ఘటన స్థలం నుంచి గజ్వేల్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి పరామర్శించారు. ఈ ఘటనలో గాయాలైన వారందరికీ మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.ఇలాంటి సంఘటన భవిష్యత్తులో మరెప్పుడు జరగొద్దని., మృతి చెందిన కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని మంత్రి హరీశ్ చెప్పారు.అయితే ప్రమాదం జరిగిన విషయం తెలియగానే మంత్రి ముఖ్య కార్యక్రమాలు రద్దు చేసుకొని రావడం పట్ల అక్కడున్న వారు మంత్రి హరీష్ కు హాట్సాఫ్ చెప్పారు.
