ఏపీలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 171వ రోజు ప్రారంభమైంది. జగన్ తో పాటు వేల మంది అడుగులో అడుగు వేస్తున్నారు. శుక్రవారం ఉదయం నైట్ క్యాంపు పెదకాపవరం నుంచి జననేత వైఎస్ జగన్ తన పాదయాత్ర చేపట్టారు. పెద కాపవరం, చిన కాపవరం, గుమ్ములూరు, తరటావ మీదుగా కొనసాగనున్న పాదయాత్ర కొల్లపర్రుకు చేరుకున్నాక వైఎస్ జగన్ విరామం తీసుకుంటారు.
లంచ్ క్యాంపు అనంతరం కొల్లపర్రు నుంచి మళ్లీ పాదయాత్ర కొనసాగించనున్న వైఎస్ జగన్, ఆకివీడులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. చివరగా అజ్జుమూరులో శుక్రవారం రాత్రి పాదయాత్ర ముగించి, రాత్రికి వైఎస్ జగన్ అక్కడే బస చేస్తారు. తమ విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన వారు జననేత జగన్‌ను నేరుగా కలుసుకుని మాట్లాడవచ్చు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గురువారం నాటికి 2,131.2 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన వైఎస్ జగన్ ప్రజలతో మమేకమవుతూ వారికి భరోసా కల్పిస్తున్నారు.