ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాని మోడీని చూస్తే ముచ్చెటలు పడుతున్నాయా..? ఆ క్రమంలోనే సీఎం చంద్రబాబు ఏపీలో ఒక మాట.. ఏపీ దాటాక మరో మాట మాట్లాడుతున్నారా..? ఓటుకు నోటు కేసులో అడ్డంగా ఇరుక్కున్న చంద్రబాబు.. ఆ కేసు నుంచి ఎలాగైనా తప్పించుకోవాలన్న క్రమంలో ప్రధాని మోడీపై విమర్శలు చేయడం లేదా..? బీజేపీతో బహిరంగంగా దెగదెంపులు చేసుకున్నా.. తెర వెనుక స్నేహబంధం కొనసాగుతోందా..? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
మమ్మల్ని గెలిపించండి .. ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తాం అంటూ టీడీపీ, ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ 2014 ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చి నిట్టనిలువునా ముంచిన విషయం తెలిసిందే. అయితే, నాలుగు సంవత్సరాలపాటు అధికారాన్ని అనుభవించిన చంద్రబాబు నాయుడు కేంద్రం వద్ద ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్థావించకపోగా.. కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట కూడా అనలేదు. అంతేకాకుండా, ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న ఉద్యమకారులపై, ప్రజలపై పోలీసుల చేత దాడులు చేయించారు సీఎం చంద్రబాబు.
దీనికంతటికి కారణం ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబు ఇరుక్కోవడమే. అయతే, ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రత్యేక హోదా అంశంపై ప్రజల్లోకి బలంగా వెళ్లింది. అందుకు కారణం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అని ప్రత్యేకంగా చెప్పనర్కర్లేదు. రాష్ట్ర విభజన నాటి నుంచి నేటి వరకు ప్రత్యేక హోదాపై అంశం మాటపై ఎవరన్నా నిలబడ్డారా..? అంటే అది ఒక్క వైఎస్ జగన్ మోహన్‌రెడ్డే. ప్రధాన ప్రతిపక్ష హోదాలో ప్రత్యేక హోదా కోసం జగన్ చేసిన పోరాటాలు. ఉద్యమాలు అనేకం. ప్రత్యేక హోదా అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు చంద్రబాబు ఎన్ని యూ టర్న్ రాజకీయాలు చేసినా వాటన్నింటిని వైఎస్ జగన్ తిప్పి కొట్టారు.