రంజాన్ పండగ ముస్లింలకు పరమ పవిత్రమైనది. ప్రపంచంలో ఏ మూలనున్న ముస్లిం అయినా ఈ పండగను అత్యంత్య నియమనిష్ఠలతో జరుపుకుంటారు. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం తరువాతే ఆహరం తీసుకుంటారు. నెలరోజులూ ముస్లింలంతా కూడా ఈ నియమాన్ని తప్పకుండా పాటిస్తారు. కోపతాపాల్లేకుండా సాత్వికంగా, శాంతియుతంగా ఉండడం, పేదలకు సహాయం చేయడం, సాటి వారితో స్నేహంగా మెలగడం, అల్లాను ఏకాగ్రతతో ప్రార్థించడం చేస్తారు.
రంజాన్ నెలరోజులూ భక్తిశ్రద్ధలతో గడుపుతారు. సూర్యోదయం ముందు, సూర్యాస్తమయం తరువాతనే ఆహారాన్ని తీసుకుంటారు. ముఖ్యంగా వీరు ఈ మాసంలో తప్పకుండా హలీం తీసుకుంటారు. హలీం ఎక్కువ క్యాలరీలతో తయారవుతుంది. అందుకే దీనికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. హలీం అనగానే భారతదేశంలో హైదరాబాద్ గుర్తొస్తుంది. హైదరాబాద్ లో హలీంను ప్రత్యేకంగా తయారుచేస్తారు. స్టార్ హోటళ్ల దగ్గర్నుంచి చిన్న హోటళ్ల వరకు రంజాన్ మాసంలో తప్పకుండా హలీం ను తయారుచేసే సంప్రదాయం దశాబ్దాలుగా కొనసాగుతూ ఉంది. హైదరాబాద్ లో చికెన్ హలీం, మటన్ హలీం వేరువేరుగా తయారు చేస్తారు. చికెన్ హలీం ఈ విధంగా తయారు చేస్తారు.
చికెన్ హలీమ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు :
చికెన్ – 750 గ్రా
షాజీరా – 2 గ్రా
ఏలకులు – 8
దాల్చిన చెక్క – 4
మిరియాలు – 3 గ్రా
లవంగాలు – 2 గ్రా
జీలకర్ర – 4 గ్రా
నువ్వులు – 3 గ్రా
పెసర పప్పు – 1 టీ స్పూన్
మినపపప్పు – 1 టీ స్పూన్
ఎర్రపప్పు – 1 టీ స్పూన్
శనగపప్పు – 1 టీ స్పూన్
బాదం – 6
ఓట్స్ – ¼ కప్పు
గోధుమ రవ్వ – ½ కప్పు
నెయ్యి – ½ కప్పు
పచ్చిమిర్చి – 5
గులాబీ పువ్వు రెక్కలు – ¼ కప్
ఉల్లిపాయ ముక్కలు – ½ కప్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
ఉప్పు – తగినంత
వేయించిన ఉల్లిపాయలు – ½ కప్పు
పెరుగు – 2 టీ స్పూన్లు
కొత్తిమీర – 1 కట్ట
పుదీనా – 1 కట్ట
తయారీ విధానం :
షాజీరా, ఏలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, జీలకర్ర, నువ్వులు, పెసర పప్పు, మినపపప్పు, ఎర్రపప్పు, శనగపప్పు, బాదం పప్పు, ఓట్స్ , గోధుమ రవ్వ కలిపి మిక్సీలో వేసి పొడిలా అయ్యేంతవరకు గ్రైండ్ చేయాలి.
ముందుగా సన్నని మంటపై ఉన్న ప్రెజర్ కుక్కర్ లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. అది కరిగాక అందులో అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. తరువాత అందులో చికెన్ వేసి 5 నిమిషాలు కలపాలి. ఆ తరువాత అందులో కొన్ని నీళ్లు, గులాబీ రేకులు, వేయించిన ఉల్లిపాయలు, పెరుగు, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, తగినంత ఉప్పు, ముందుగా మిక్సీ పట్టి పొడిగా చేసుకున్న మసాలాను వేసి ఉండలు కట్టకుండా బాగా కలపాలి. ఆ తరువాత కుక్కర్ మూతపెట్టాలి. 2 విజిల్స్ వచ్చే వరకు పెద్ద మంటమీద చికెన్ ను ఉడికించాలి. 2 విజిల్స్ తరువాత మంటను తగ్గించి మొత్తం 45 నిమిషాలు ఉడికించాలి. 45 నిమిషాల తరువాత కుక్క మూత తీసి చికెన్ ను బంగాళాదుంప స్మాషర్ తో మెత్తగా అయ్యేలా కలియబెట్టాలి. ఉడికిన చికెన్ బాగా మెత్తగా, హలీంలా అయ్యేంత వరకు కలియబెట్టాలి. ఆ తరువాత నెయ్యి వేసి కలిపి మూతపెట్టాలి. నెయ్యి పైకి తేలేంత వరకు చికెన్ ను ఉడికించాలి.
నెయ్యి పైకి తేలగానే స్టవ్ ఆఫ్ చేసి హలీమ్ ను ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దానిపై కొంచం నెయ్యి, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, వేయించిన జీడిపప్పు, కొంచం పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం చల్లి వేడివేడిగా సర్వ్ చేయండి.