రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీన అన్ని పాఠశాలల్లో పండగలా జరగాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి డీఈఓలకు ఆదేశించారు. విద్యార్థులంతా ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పాల్గొనేందుకు వీలుగానే వేసవి సెలవులను ముందుకు జరిపి, పాఠశాలల పున: ప్రారంభాన్ని జూన్ 1వ తేదీ నుంచి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పాఠశాలల్లో ఘనంగా నిర్వహించేందుకు అదనపు నిధులు అందిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలల పున: ప్రారంభం నాటికి అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉండాలనే ఉద్దేశ్యంతో నేడు సర్వశిక్ష అభియాన్ కార్యాలయంలో డీఈఓల సమావేశం నిర్వహించి దిశానిర్ధేశనం చేశారు.
జూన్ 1వ తేదీ నుంచి పాఠశాలలను పున: ప్రారంభిస్తున్నామని ఆ సమయానికే విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్ పూర్తిస్థాయిలో అందాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి డీఈఓలను ఆదేశించారు. ఇప్పటి వరకు యూనిఫామ్స్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో 8వ తరగతి విద్యార్థుల వరకే అందిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది నుంచి 9,10వ తరగతి విద్యార్థులకు కూడా యూనిఫామ్స్ అందించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఇందుకోసం టెస్కోకు ఆర్డర్ ఇచ్చామన్నారు. దీనికోసం ఏటా 30 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, దీనిని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు సున్నాలు వేయించి, చిన్న చిన్న మరమ్మత్తులు చేయించాలన్నారు. తాగునీరు, విద్యుత్ సరఫరాలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదన్నారు. టాయిలెట్స్ పనిచేసే కండిషన్లో ఉండాలని, పాఠశాల ఆవరణ పూర్తిగా చదువుకునే వాతావరణం కలిగేలా ఉండాలన్నారు.
ఈ ఏడాది రాష్ట్రంలో 8 లక్షల మంది విద్యార్థినులకు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అందిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. జడ్పీహెచ్ఎస్, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, గురుకులాల్లోని విద్యార్థినిలందరికీ ఈ కిట్స్ అందిస్తామన్నారు. ఈ కిట్స్ లో విద్యార్థినిలకు కావల్సిన అన్ని ఐటెమ్స్ బ్రాండెడ్ వస్తువులేనని చెప్పారు. దాదాపుగా ఒక్కో కిట్ కు 400 రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. మూడు నెలలకు సరిపోయే విధంగా ఒక్క కిట్ ను రూపొందించామన్నారు. పాఠశాలలు పది నెలలే ఉన్నా ఈ కిట్స్ మాత్రం 12 నెలలకు సరిపోయేలా ఇస్తున్నామన్నారు. ప్రతి మూడు నెలలకొక కిట్ చొప్పున ఏడాదిలో నాలుగుసార్లు కిట్ ఇస్తున్నామని, ఒక్కో విద్యార్థికి 1600 ఖర్చు చేస్తున్నామని చెప్పారు. దీనివల్ల ఏటా రాష్ట్రప్రభుత్వం 85 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందన్నారు. ఇలాంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదన్నారు. ఈ కిట్ల పంపిణీలో స్థానిక నేతలను కూడా భాగస్వామ్యం చేయాలని అధికారులకు సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎక్కువ శాతం బాలికల్లో రక్తహీనత ఉంటుందని గుర్తించామని, దీనిని అధిగమించేందుకు పౌష్టికాహారం అందించే మెనును రూపొందించామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఈ మెనులో నెలకు నాలుగుసార్లు చికెన్, రెండుసార్లు మటన్, వారానికి ఐదు సార్లు గుడ్లు, ప్రతి రోజు 50 గ్రాముల నెయ్యి అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో మాత్రమే ఇలాంటి మెనును విద్యార్థులకు అందిస్తున్నామని, దేశంలో ఎక్కడా ఇలా అందించడం లేదన్నారు.
కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలను 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పొడగించడంలో తెలంగాణ ప్రభుత్వ కృషి ప్రధాన కారణమన్నారు. దేశవ్యాప్తంగా బాలికా విద్యను పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీకి తనను చైర్మన్ గా నియమించారని, ఈ కమిటీ రెండేళ్లుగా వివిధ రాష్ట్రాల్లో తిరిగి బాలిక విద్యను అధ్యయనం చేసిందన్నారు. కేజీబీవీలు 8వ తరగతి వరకే ఉండడం వల్ల, అక్కడ చదువు అయిపోగానే విద్యార్థినిలకు పెళ్లిళ్లు చేస్తున్నారని, డ్రాపవుట్స్ పెరుగుతున్నాయని తమ అధ్యయనంలో తేలిందన్నారు. అందుకే కేజీబీవీలను 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పొడగిస్తే ఈ డ్రాపవుట్స్ తగ్గుతాయని, బాల్యవివాహాలను అరికట్టవచ్చని సూచించామని, కేంద్రం దీనిని ఆమోదించడంతో కేజీబీవీలు 12వ తరగతి వరకు నడవనున్నాయని చెప్పారు.
జూలైలో అన్ని పాఠశాలల్లో హరితహారం పెద్ద ఎత్తున నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమై దీనిని విజయవంతం చేయాలన్నారు. పాఠశాలలు గ్రీన్ స్కూల్స్ గా ఉండాలన్నారు.
ఈసారి విద్యావాలంటీర్ల అవసరం లేకుండానే కొత్త ఉపాధ్యాయులతో పాఠశాలలు నిర్వహిస్తామని అనుకున్నామని, కోర్టులో కేసు వల్ల మళ్లీ విద్యావాలంటీర్లను నియమించుకోవాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి డీఈఓలకు చెప్పారు. వీలైనంత త్వరగా ఈ కేసును ఉపసంహరింప చేసి రెగ్యులర్ టీచర్లు వచ్చేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు.
ముఖ్యమంత్రి కేసిఆర్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో సమావేశమై సాధారణ బదిలీలకు అంగీకరించారని, దీని జీవో కూడా వచ్చిందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీలకోసం ప్రత్యేకంగా గైడ్ లైన్ రూపొందించి విడుదల చేస్తామన్నారు. ఈ బదిలీలకు సంబంధించి ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను ఎలాంటి పొరపాట్లు లేకుండా తయారు చేయాలన్నారు. గతంలో జరిగినప్పుడు కొన్ని తప్పులు జరిగాయని, చర్యలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఈసారి అలాంటివి జరగకుండా చూసుకోవాలని చెప్పారు. పూర్తిగా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు జరుగుతాయని, వెయిటేజీ పాయింట్స్, సీనియారిటీ రూపకల్పనలో తప్పులు లేకుండా చేయాలన్నారు. ఏవైనా పొరపాట్లు జరిగితే అధికారులే బాధ్యత వహించాలన్నారు. పాత జిల్లాల ప్రాతిపదికన ఈ బదిలీలు జరుగుతాయని, ప్రతి జిల్లాకొక సీనియర్ ఉన్నతాధికారిని నియమిస్తామన్నారు. నూటికి నూరు శాతం పారదర్శకంగా జరుపుతామన్నారు. ఐదేళ్లు నిండిన ప్రధానోపాధ్యాయులు, ఎనిమిదేళ్లు అయిన ఉపాధ్యాయులను బదలీ చేయాలన్నారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా ఒక ఒప్పందానికి వస్తున్నాయని, ఇది శుభ పరిణామంగా అభివర్ణించారు.
విద్యా సంవత్సరం అకాడమిక్ కాలెండర్ పై జూన్ మొదటి వారంలో వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి డీఈఓలకు తెలిపారు. ఈ వర్క్ షాప్ లో సీసీఈపై కూడా సమీక్ష చేస్తామని, ఇందులో వచ్చిన ప్రతిపాదనలను అమలు చేస్తామని తెలిపారు.
ఈ విద్యా సంవత్సరం నుంచి ఉపాధ్యాయులెవరు డీఈఓ, ఎంఈఓ కార్యాలయాల్లో పనిచేయకూడదని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. డీఈఓ, ఎంఈఓ కార్యాలయాల్లో పనిచేస్తున్న టీచర్లందరినీ వెంటనే వాటి పాఠశాలలకు పంపించాలని ఆదేశించారు. ఈ కార్యాలయాల్లో ఇతర పనులకోసం సిబ్బందిని ప్రభుత్వ అనుమతి తీసుకుని అవుట్ సోర్సింగ్ పై నియమించుకోవాలన్నారు.
ఇటీవల జరిగిన పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఫలితాల్లో బాగా పనిచేసిన అధ్యాపకులు, సిబ్బందికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అభినందనలు తెలిపారు. ఈ సంవత్సరం ఈ ఫలితాలు మరింత పెరిగే విధంగా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ విద్య ప్రతిష్ట పెరిగేలా, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా పనిచేయాలని కోరారు.
పాఠశాలల పున:ప్రారంభం నాటికి అక్కడ పూర్తిగా చదువుకునే వాతావరణం కల్పించాలని, అందుకోసం ఏవైనా అవసరాలుంటే వాటన్నింటిని కల్పిస్తామని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య డీఈఓలకు హామీ ఇచ్చారు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి త్వరలోనే గైడ్ లైన్స్ పంపిస్తామని, వెంటనే డీఈఓలు ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా, ఖాళీల జాబితాను సిద్ధం చేసి ఉంచాలన్నారు. పరీక్షలను సజావుగా నిర్వహించి ఉత్తమ ఫలితాల కోసం కృషి చేసిన వారందరిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సంక్షేమం, మౌలిక వసతులు, అభివృద్ధి సంస్థ ఎండీ విజయ్ కుమార్, గురుకులాలు మరియు మోడల్ స్కూళ్ల డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, కేజీబీవీల డైరెక్టర్ శ్రీహరి, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సుధాకర్,టెక్స్ట్ బుక్స్, ఓపెన్ స్కూల్ డైరెక్టర్ శర్మ, సైట్ మరియు గ్రంథాలయాల డైరెక్టర్ రమణకుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.