ఒక్కోరకం మామిడి కాయలను చూడాలన్నా, తినాలన్నా ఒక్కో చెట్టు వద్దకు వెళ్లటమో లేక వ్యాపారుల వద్ద ఒక్కోరకం కొని తినడమో చేయాలి. అలాకాకుండా 12 రకాల మామిడి కాయలు ఒకే చెట్టుకు లభిస్తే వాటి రుచిని ఒకే రోజు ఆస్వాదించగలిగితే ఆ మజానే వేరు. ఇలాంటి అరుదైన సంఘటన జూపాడుబంగ్లాలోని నాగశేషులు ఇంటి పెరట్లో చోటుచేసుకుంది. ఇక్కడ ఒకే మామిడి చెట్టుకు కాసిన 12 రకాల మామిడి కాయలను చూసి ఆశ్చర్యచకితులవుతున్నారు. నాగశేషులు 1993 నుంచి హార్టిక ల్చర్‌లో చెట్లకు గ్రాఫ్టింగ్ (అంటుకట్టు పద్ధతి)లో నైపుణ్యం సంపాదించాడు.
తనకున్న అనుభవంతో అతను తనపెరట్లో తినిపారేసిన మామిడిపిచ్చలు మొలకెత్తడంతో ఓ చెట్టుపై గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా బనగానపల్లె, డోన్, పంచలింగాల, ఉయ్యాలవాడ తదితర ప్రాంతాల్లో లభించే అల్ఫాన్స్, పెద్దరసం, నీలిశా, స్వర్ణజాంగీర్, రెడ్డి పసంద్, బేనిషా, మల్లికారసం, అనుపాళి, పెద్దాచారి, చిన్నాచారి, నీల్‌గోవ, హిమయత్ తదితర 20 రకాల మొక్కలను తెచ్చి చెట్టుకు అంటుకట్టాడు. మూడేళ్ల అనంతరం ఈ ఏడాది నాగశేషులు పెరట్లోని మామిడి చెట్టు గుత్తులు గుత్తులుగా 12 రకాల మామిడి కాయలను కాసింది. ఈ చెట్టును చూసిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నాగశేషులు తనకున్న నైపుణ్యం వల్ల ఒకే చెట్టుకు 12 రకాల మామిడి కాయలు కాయించగలగటాన్ని అందరూ ప్రశంసిస్తున్నా రు. ఇతని పెరట్లో ఉన్న మరో మా మిడి చెట్టు ఐదేళ్లు కావొస్తున్నా కాపునకురాలేదు. అంటుగట్టు పద్ధతి ద్వా రా త్వరగా చెట్లు కాపునకువస్తాయని నాగశేషులు పేర్కొంటున్నారు.