కాంగ్రెస్, బీజేపీలకు భారీ షాక్ తగిలింది. నల్లగొండ జిల్లాలో ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలు టీఆర్ఎస్ గూటికి చేరారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్ట్స్‌లో మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ నియోజకవర్గం ఇరుగంటి పల్లి, తంగళ్లవారి గూడెంకు చెందిన సుమారు 200మంది కాంగ్రెస్, బిజెపి కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ మంత్రి జగదీష్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ గత కాంగ్రెస్ పాలకులు నల్లగొండ జిల్లాను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి జిల్లాను నాశనం చేశారని మండిపడ్డారు. ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా కేవలం పదవుల కోసం పాకులాడారని విరుచుకుపడ్డారు. ప్రాజెక్ట్ కాలువల టెయిల్ పాండ్ వరకు నీళ్లు అందించిన ఘనత టీఆర్ఎస్ పార్టీదని మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంతో జిల్లా రైతాంగం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఎవరు అడగపోయిన రైతుబంధు పథకం అమలు చేస్తున్నామన్నారు. అన్ని వర్గాల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని మంత్రి తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్‌లో చేరుతున్నారని వివరించారు.