ఏపీలో అత్యంత దారుణంగా బాలికలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న గుంటూరులో అతి దారుణంగా బాలికపై అత్యాచారం ఘటన మరవకముందే ..చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణం చోటు చేసుకుంది. స్థానిక భగత్ సింగ్ కాలనీలో 11 ఏళ్ల బాలికపై ఐదుగురు మైనర్ల అత్యాచారం చేశారు. డబ్బులు ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి 14 ఏళ్ల బాలుడు ఆ బాలికను లొంగ దీసుకున్నాడు. అతడు లైంగిక వాంఛలు తీర్చుకున్న తర్వాత అతడి నలుగురు స్నేహితులు కూడా ఆమెపై అత్యాచారం చేశారు. మూడు నెలలుగా వారు బాలికపై అత్యాచారం చేస్తున్నారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. దీంతో బెదిరిపోయిన బాలిక తనలో తానే కుమిలిపోతోంది.
బాలిక ప్రవర్తనలో మార్పు రావడం గమనించిన తల్లి నిఘా పెట్టి జరిగిన ఘోరాన్ని పసిగట్టింది. వెంటనే భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులంతా మైనర్లు కావడంతో వారిని అదుపులోకి తీసుకోవడానికి మొదట పోలీసులకు తటపటాయించారు. బాలికను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలికపై అత్యాచారం జరిగిందని డాక్టర్లు ధృవీకరించారు.
గత మూడు నెలలుగా బాలికను లైంగికంగా వేధిస్తున్న నలుగురు నిందితులను స్థానికులు పట్టుకొని చితక బాదారు. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకునే ప్రమాదం ఉండటంతో.. బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు నిందుతుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు.