కోడెల శివ ప్రసాద్. ఏపీ అసెంబ్లీ స్పీకర్, అంతేకాదు గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగుతున్న పొలిటీషియన్. స్పీకర్ కోడెల శివ ప్రసాద్ నర్సారావుపేట నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఆరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన కోడెల శివప్రసాద్‌కు ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన మద్దతుతో స్పీకర్‌గా ఎన్నికయ్యారు.
అయితే, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కోడెల శివప్రసాద్‌కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. స్పీకర్ కోడెల కుటుంబం అటు నర్సారావుపేట, ఇటు సత్తెనపల్లి నియోజకవర్గాల్లో భారీస్థాయిలో అవినీతికి పాల్పడటమే ఇందుకు కారణం. సామాన్య ప్రజల నుంచి ప్రభుత్వ అధికారుల వరకు, కాంట్రాక్టర్లను సైతం వదలకుండా కోడెల ఫ్యామిలీ వారిపై దాడులను కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా, భూ కబ్జాలకు పాల్పడుతూ సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నది కోడెల కుటుంబంపై ఉన్న ప్రధాన ఆరోపణ. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి కోడెల ఫ్యామిలీ అరాచకాలు తారా స్థాయికి చేరాయన్నది ఆ రెండు నియోజకవర్గాల ప్రజల మాట.
ఆ విషయం కాసేపు అటుంచితే.. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా కోడెల శివప్రసాద్ సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సి వచ్చిన విషయం తెలిసిందే. రాజకీయ పరిస్థితుల దృష్ట్యా నరసారావుపేట నియోజకవర్గంలో స్పీకర్ కోడెల రాజకీయంగా పట్టు కోల్పోయారు.
అయితే, స్పీకర్ కోడెలను ఇప్పుడు ఓ బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతోంది. అదేమిటంటే.. స్పీకర్‌గా విధులు నిర్వహించిన వారు తిరిగి ఎన్నికల్లో గెలవకపోవడమే. ఇప్పుడు స్పీకర్‌గా ఉన్న కోడెల పరిస్థితి కూడా అంతే. వచ్చే ఎన్నికల నుంచి స్పీకర్ కోడెలకు రాజకీయ సన్యాసం తప్పదేమోనన్న సందేహాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
1978లో స్పీకర్‌గా విధులు నిర్వహించిన దివి కొండయ్య చౌదరి, ఆ తరువా కాలంలో స్పీకర్‌గా విధులు నిర్వర్తించిన ఈశ్వర్‌రెడ్డిలు ఇద్దరూ కూడా రాజకీయంగా కనుమరుగైన విషయం తెలిసిందే. అలాగే, 1985లో స్పీకర్‌గా పనిచేసిన నారాయణరావు పరిస్థితి కూడా అంతే. తరువాత జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూశారు. 1990లో స్పీకర్‌గా చేసిన రామచంద్రారెడ్డి మళ్లీ జరిగిన ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు. అలాగే, 1999లో స్పీకర్‌గా చేసిన శ్రీమతి ప్రతిభా భారతి మూడుసార్లు జరిగిన ఎన్నికల్లో వరుస ఓటములను చవి చూశారు. 2004లో స్పీర్గా చేసిన సురేష్‌రెడ్డి పరిస్థితి కూడా అంతే. 2009 ఎన్నికల తరువాత స్పీకర్‌గా చేసిన ఎన్.కిరణ్ కుమార్‌రెడ్డి తరువాత రాజకీయ పరిణామాల దృష్ట్యా ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఆ తరువాత రాజకీయాలకు దూరమయ్యారు. కిరణ్ కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టడంతో తరువాత స్పీకర్ పదవి చేపట్టిన నాదెండ్ల మనోహర్‌రెడ్డి రాజకీయంగా దెబ్బతిన్నారు.
ఇలా ఏపీ స్పీకర్‌గా విధులు నిర్వహించిన వారంతా తరువాత జరిగే ఎన్నికల్లో ఘోర ఓటములు చవిచూస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రస్తుత స్పీకర్ కోడెల శివప్రసాద్ పరిస్థితి ఏంటి..? ఆయన కూడా గత స్పీకర్ల లానే ఓటమి పాలవుతారా..? రాజకీయ సన్యాసం తప్పదా..? అన్న ప్రశ్నలు టీడీపీ వర్గాలను కలవరానికి గురి చేస్తున్నాయి.