రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుమారు 4 లక్షల నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకగా కొత్త దుస్తులు అందించేందుకు చర్యలు చేపట్టింది.800 మసీదు కమిటీల ఆధ్వర్యంలో రంజాన్ కానుకల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది.అందులోభాగంగానే గ్రామీణ ప్రాంతాల్లో 400, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో 400 మసీదులను గుర్తించింది.
ప్రతిమసీదు పరిధిలో 500 పేద కుటుం బాలను ఎంపిక చేసి మూడు జతల కొత్త దుస్తులు గల ప్యాకెట్లను పంపిణీ చేయనుంది. ఒక్కోదానిలో రూ.525 విలువ గల కుర్తా, పైజామా, సల్వారు, కమీజు, చీర, బ్లౌజ్ అందించనుంది.అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ హ్యాండ్లూమ్ అండ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ(టెస్కో)తో రంజాన్ దుస్తుల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. కొత్త దుస్తుల కోసం సుమారు రూ.21 కోట్లను వెచ్చిస్తోంది. 800 మసీదుల్లో దావతే ఇఫ్తార్ విందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
గ్రామీణ ప్రాంతాల్లో 400, జీహెఎంసీ పరిధిలో 400 మసీదుల్లో దావతే ఇఫ్తార్ విందు ఏర్పాట్లకు చర్యలు చేపట్టింది. ప్రతి నియోజకవర్గానికి 4 మసీదుల చొప్పున ఎంపిక చేసి 4 లక్షల మందికి విందు ఏర్పాటు చేస్తోంది. ఇందు కోసం మసీదుకు లక్ష రూపాయల చొప్పున మొత్తం రూ.8 కోట్లు వెచ్చిస్తోంది.