కేరళను వణికిస్తున్న నిపా వైరస్ తెలంగాణ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. నిపా వైరస్ పై వైద్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉందని చెప్పారు. నిపా వ్యాధి కి టీకాలు లేవని నివారణ ఒక్కటే మార్గం అన్నారు. ఇప్పటికే పూణే లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ తో నిపా వ్యాధి నిర్ధారణ పరీక్షల కు అవగాహనకు వచ్చామన్నారు. అలాగే ఢిల్లీ లోని NCDC (National Center for Decease Controle), మణిపాల్ లోని MCVR (Manipal Center for viralogy and Research) లతోనూ మాట్లాడమన్నారు. ప్రధాన వైద్యశాలల్లో ప్రత్యేక వార్డులు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఐపిఎం ఆధ్వర్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ప్రజల్లో అవగాహన, చైతన్యంతో ఇలాంటి వ్యాధులను అదుపు చేయడం, నివారించడం సాధ్యం అన్నారు. ఈ మేరకు వైద్య మంత్రి లక్ష్మారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.
నిపా వైరస్ ఇప్పుడే పుట్టుకొచ్చిందేమీ కాదని, 1998-99లోనే మలేషియా, సింగపూర్‌లలో ఈ వైరస్ వ్యాప్తి చెందిందన్నారు. నిపా వైరస్ (NiV) పారామిక్సోవిరిడే జాతికి చెందిన వైరస్ అన్నారు. అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వెల్లడించిందన్నారు. ఇండియాలోనూ గతంలో ఈ వైరస్ లక్షణాలు కనిపించాయి. బంగ్లాదేశ్‌లో అయితే ప్రతి ఏటా కనిపిస్తూనే ఉంటుందని సీడీసీ తెలిపిందన్నారు.
గబ్బిలాలు, సరిగా ఉడకని పంది మాంసంతో…
కొన్ని జాతుల గబ్బిలాలు, సరిగా ఉడకని పంది మాంసం భుజించడం ద్వారా ఈ వైరస్ సోకినట్లు గుర్తించారన్నారు. ఆ తర్వాత ఇండియాలోని సిలిగురిలో కూడా వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఈ వైరస్ సోకుతున్నట్లు గుర్తించారన్నారు.
వ్యాధి లక్షణాలు
ఈ వైరస్ కారణంగా మెదడు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తుతాయని మంత్రి చెప్పారు. ఈ నిపా వైరస్ ముదరడానికి 7 నుంచి 14 రోజుల సమయం పడుతుందని ఆ తర్వాత శరీరంలో చాలా వేగంగా మార్పులు కనిపిస్తాయన్నారు. జ్వరం, సడెన్‌గా శ్వాస ఆడకపోవడం, లో బీపీ, ఒక్కోసారి కోమాలోకి కూడా వెళ్లే ప్రమాదం ఉంది. ప్రస్తుతానికి ఈ వైరస్ సోకిన వారికి ప్రపంచంలో ఎలాంటి చికిత్స అందుబాటులో లేదన్నారు.
ఎలా సోకుతుంది?
ఈ నిపా వైరస్ ఓ జూనోటిక్ వైరస్. అంటే ఇది మనుషులకు గాలి ద్వారా లేక లాలాజలం ద్వారా సోకుతుందని, గబ్బిలాలను తాకడం లేదా అవి కొరికిన పండ్లు తినడం ద్వారా ఈ వైరస్ సోకే ప్రమాదం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారని మంత్రి వివరించారు.
చికిత్స
అయితే ఆస్ట్రేలియాలో గుర్రాలకు హెండ్రా అనే వైరస్ సోకినపుడు ఇచ్చే చికిత్సనే ఈ నిపాకు కూడా ప్రస్తుతం ఇస్తున్నారు.
అయితే, నిపా వైరస్ పై వైద్య శాఖ అప్రమత్తంగా ఉందన్నారు. దేశంలో ఇలాంటి వైరస్ ల విషయంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసే పూణే లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ఢిల్లీ లోని NCDC (National Center for Decease Controle), మణిపాల్ లోని MCVR (Manipal Center for viralogy and Research) లతోనూ మాట్లాడామన్నారు. నిపా వ్యాధి నిర్ధారణ పరీక్షల కు అవగాహనకు వచ్చామన్నారు. మన వద్ద ఈ పరీక్షలకు సంబంధించిన కిట్స్, శిక్షణ పొందిన సిబ్బంది లేరన్నారు.
ఇక హైదరాబాద్ లోని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఫీవర్ హాస్పిటల్స్, వరంగల్ లోని ఎంజీఎం హాస్పిటల్స్ లలో 5 నుంచి 8 పడకలతో ప్రత్యేక వార్డులు, వ్యాధి నిధారణకు మూత్ర, రక్త, CSF (Celebro spinal fluid) నమూనాలను సేకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి లక్ష్మారెడ్డి వివరించారు.
ఇప్పటికే ఐపీఎం (INDIAN PREVENTIVE MEDICINE) డైరెక్టర్ డాక్టర్ కంపా శంకర్ ఇదే పనిపై ఉన్నారన్నారు. మిగతా వైద్యశాఖ ఉన్నతాధికారులను సైతం అప్రమత్తంగా ఉండాలని అదేశించామన్నారు.
ప్రజలు వ్యాధి లక్షణాలు గుర్తించి వెంటనే సమీప ప్రభుత్వ వైద్యులను సంప్రదించాలని మంత్రి కోరారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, అవగాహన, చైతన్యంతో ఉండాలని, ప్రాథమిక స్థాయిలోనే ఇలాంటి వ్యాధులను నివారించవచ్చని మంత్రి లక్ష్మారెడ్డి వివరించారు.