కర్నూలు జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో టీడీపీ నాయకుల తీరు! ఇక్కడ నేతల మధ్య ఆధిపత్య పోరుతో పాటు వర్గ పోరు కూడా పెరిగిపోయింది. దీంతో పార్టీని పట్టించు కు నేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న రాజకీయాలు పార్టీకి చేటు తెచ్చేలాగా కనిపిస్తున్నాయి. ఈ నెల ఆఖరులో టీడీపీ పండుగ మహానాడు జరగనుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులను ఉత్సాహపరిచేందుకు, స్థానిక సమస్యలు చర్చించి తీర్మానం చేసేందుకు అన్ని నియోజకవర్గాల్లోనూ మినీ మహానాడులను నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఈ క్రమంలోనే అన్ని నియోజకవర్గాల్లోనూ నాయకులు మినీ మహానాడులకు శ్రీకారం చుట్టారు. అయితే, కర్నూలు జిల్లా బనగానపల్లిలో మాత్రం ఇప్పటి వరకు మినీ మహానాడు నిర్వహించలేదు. ఇక్కడి సమస్యలపై ఎలాంటి తీర్మానం చేయలేదు. దీంతో ఈ నియోజకవర్గం తాజాగా వార్తల్లోకి ఎక్కింది. టీడీపీకి చెందిన బీసీ జనార్దనరెడ్డి 2014లో ఇక్కడ నుంచి గెలుపొందారు. అంటే.. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే ఉన్నా.. ఇక్కడ మినీ మహానాడు నిర్వ హించకపోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ మారింది.
బనగానపల్లె నియోజకవ ర్గంలో చల్లా, కాటసాని, ఎర్రబోతుల వర్గాలు ప్రధానంగా ఉన్నాయి. 2014 ఎన్నికల్లో బీసీ జనార్దనరెడ్డికి, మాజీ ఎమ్మెల్యే చల్లా రామక్రిష్ణారెడ్డి పూర్తి సహకారాన్ని అందించారు. ఆయన కృషితో ఒక్క అవుకు మండలంలోనే టీడీపీకి ఏకంగా 5 వేల వరకు మెజార్టీ వచ్చింది. ఫలితంగా టీడీపీ ఎమ్మెల్యే గెలుపొందారు. అయితే, చల్లా త్యాగాన్ని గుర్తించిన చంద్రబాబు.. ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే, నాలుగేళ్లు గడిచినా ఇప్పటి వరకు ఎమ్మెల్సీ దక్కలేదు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చల్లాకు అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే బీసీ జనార్దన రెడ్డి అధి నాయకత్వంపై ఒత్తిడి తెచ్చారు. అవకాశం దక్కకపోగా ఇటీవల నియమించిన నామినేటెడ్ పదవుల్లో చల్లాకు ఆర్టీసీ కడప రీజియన్ చైర్మన్ పదవి ఇచ్చారు. సీనియర్ నాయకుడినైన తనకు రీజనల్ పదవి ఇస్తారా..? అంటూ ఆ పదవిని చల్లా తిరస్కరించారు. అదే క్రమంలో గత ఎన్నికల నాటి నుంచి దూరంగా ఉంటూ వస్తున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఎర్రబోతుల వెంకటరెడ్డి వర్గాలు ఏకమయ్యాయి. అంతేగాక ఇక 2019 లో ఖచ్చితంగా వైసీపీ విజయం ఖాయమని అందుకే బీసీ జనార్దనరెడ్డిని.. చల్లాను కూడా వైసీపీలోకి లాగేందుకు కడప జిల్లాకు చెందిన వైసీపీ కీలక నాయకుడు ఒకరు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇది జరిగితే ఇంకా కర్నూల్ లో టీడీపీ ఖాళీ అవ్వడం ఖాయం అంటున్నారు వైసీపీ అభిమానులు.