తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ ఈ రోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ క్రమంలోనే మంత్రి పర్యటన ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొనసాగనున్నది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్‌లోని శివారు ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో మౌళిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి మంచినీరు ఇవ్వాలనే లక్ష్యంతో జలమండలి పలు రిజర్వాయర్ల నిర్మాణాలను చేపట్టింది.
తాజాగా నిర్మాణం పూర్తయిన ఐదు రిజర్వాయర్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. వీటికితోడు రూ.50 కోట్లతో నిర్మించనున్న రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేస్తారు. ఈ సందర్భంగా శేరిలింగపంల్లిలోని హఫీజ్‌పేట్, కూకట్‌పల్లిలోని ఎల్లమ్మ బండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తారు. ముందుగా ఉదయం 10 గంటలకు అయ్యప్ప సొసైటీ వద్ద జలమండలి నిర్మించిన రిజర్వాయర్‌ను ప్రారంభిస్తారు. అనంతరం శిల్పారామంలో అత్యాధునికంగా నిర్మించిన ఏసీ బస్‌షెల్టర్‌ను ప్రారంభిస్తారు.
ఆ తర్వాత శేరిలింగపల్లి డియెన్స్ కాలనీ, కొండాపూర్‌లోని తులిప్, హఫీజ్‌పేట్‌లో నిర్మించిన రిజర్వాయర్లను ప్రారంభిస్తారు. హఫీజ్‌పేట్ బహిరంగ సభలో మాట్లాడుతారు. అనంతరం హైదర్‌నగర్ రిజర్వాయర్‌ను ప్రారంభిస్తారు. హెచ్‌ఎంటీ హిల్స్, ఎల్లమ్మబండ, వివేకానంద నగర్‌లో రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి ఎల్లమ్మబండ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతారు. మంత్రి పర్యటన సందర్భంగా స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు.