కర్ణాటక సీఎంగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న కుమారస్వామిని గులాబీ అధినేత , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కలిసి అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ను తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా కుమారస్వామి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం బెంగళూరు బయల్దేరి వెళ్లారు.
దేవేగౌడ నివాసానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు.. దేవేగౌడ స్వయంగా పుష్పగుచ్ఛం ఇచ్చి సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్.. దేవేగౌడకు, కుమారస్వామికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కుమారస్వామిని శాలువాతో సత్కరించారు. మంత్రులను, ఎంపీలను పరిచయం చేశారు. రేపు అత్యవసర సమావేశాల దృష్ట్యా సీఎం బెంగళూరు నుంచి ఈ రాత్రికే హైదరాబాద్‌కు తిరిగిరానున్నారు.సీఎం వెంట స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి లక్ష్మారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు కేకే సంతోష్ కుమార్, వినోద్, మిషన్ భగీరథ ఛైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎండీసీ ఛైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి ఉన్నారు.