నవ్యాంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీకి త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గట్టి షాక్ తగలనుందా..? ప్రస్తుత ఏపీ రాజకీయాల నేపథ్యంలో అన్ని జిల్లాల ప్రజల మద్దతు ఏ పార్టీకి..? గత ఎన్నికల్లో టీడీపీకి అత్యధిక సీట్లు కట్టబెట్టిన ప్రజలు ఇప్పుడేమంటున్నారు..? ఉభయ గోదావరి జిల్లాల్లో 2014 ఎన్నికల సీన్ రివర్స్ కానుందా..? ప‌్రస్తుతం రాజకీయంగా టీడీపీ గ్రాఫ్ ఎంత..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథనాన్ని పూర్తిగా చదవాల్సిందే..!!
అయితే, 2014 ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు కాని హామీలు ఇచ్చి ఏపీ ప్రజలను నిండా ముంచిన విషయం తెలిసిందే. అందులో ప్రధానమైనవి ప్రత్యేక హోదా సాదిస్తా.. ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తా… రైతు, డ్వాక్రా మహిళల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తా, సింగపూర్, జపాన్‌లను తలదన్నేలా ఏపీ రాజధాని అమరావతి నిర్మిస్తానంటూ చంద్రబాబు హామీల వర్షం కురిపించారు. అయితే, చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి టీడీపీకి ఓట్లేసిన ప్రజలను పట్టించుకోకుండా.. చంద్రబాబు పాలనను కొనసాగించడం గమనార్హం.
అలాగే, 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారం చేజిక్కించుకోవడానికి ప్రధాన కారణం.. ఉభయ గోదావరి జిల్లాల ప్రజలే. ఇప్పుడు ఆ రెండు జిల్లాల ప్రజలు టీడీపీపై గుర్రుగా ఉన్నారు. తమకు పూర్తిగా రుణమాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాలుగు సంవత్సరాలు కావస్తున్నా.. ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదంటూ రైతులు డ్వాక్రా మహిళలు పెదవి విరుస్తున్నారు. ఇలా చంద్రబాబు చేసిన తప్పిదాల వల్ల ఆ జిల్లాల టీడీపీ నేతలు ప్రజలకు తారసపడకుండా తిరుగుతున్నారన్నది ఒక టాక్. మరో పక్క వైసీపీ నేతలు నిత్యం ప్రజల మధ్యన తిరుగుతూ.. ప్రజల్లో తమ బలం పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల సీన్ రివర్స్ కానుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అలాగే, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాత్రం ఓ వైపు ప్రత్యేక హోదాపై నిరంతర పోరాటం చేస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్నారు. అలాగే, ప్రజా సంకల్ప యాత్ర ద్వారా నిత్యం ప్రజల మధ్యన ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా సంకల్ప యాత్ర ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చిన జగన్‌కు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఏ ఒక్కరిని కదిలించినా.. అన్నా వైసీపీకే నా ఓటు అంటూ చెప్పడం గమనార్హం. ఇలా పై విషయాలన్నింటిని బేరీజు వేసుకున్న రాజకీయ విశ్లేషకులు 2014 ఎన్నికల సీన్ త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలతో రివర్స్ కానుందని, ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయనుందని, అలాగే, మిగతా జిల్లాల్లోనూ వైసీపీ అత్యధిక అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందడం ఖాయమంటూ రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.