ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అవినీతి , అక్రమాలు, అరాచకాలకు నిలయంగా మార్చి సర్వనాశనం చేశాడని అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త , మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలం ఎల్‌బీ నగర్‌కు చెందిన ముల్లంగి సోదరులు నారాయణస్వామి, భాస్కర్ నాయుడు, లింగదహాళ్ సర్పంచ్ లింగప్పలు వైసీపీకి చెందిన అతిరథ మహారథుల సమక్షంలో ఆదివారం పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అబద్ధపు హామీలతో చంద్రబాబు ఏపీ ప్రజలను వంచించాడని విమర్శించారు. తన సామాజిక వర్గం వారు కూడా తలదించుకునేలా చేశాడని దుయ్యబట్టారు. కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం సిగ్గుచేటని అంటున్నారని, అయితే రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, మంత్రి పదవులు ఎలా ఇచ్చాడని ప్రశ్నించారు. బాబు చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వైపు బీజేపీకి డబ్బు పంపి, మరోవైపు రాష్ట్రం ముక్కలు కావడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిగ్గు, లజ్జా లేదా అని ప్రశ్నించారు. రాయదుర్గం నియోజకవర్గంలో అవినీతి కాలవ ప్రవహిస్తోందన్నారు. మంత్రి కాలవ కు చిత్తశుద్ధి వుంటే కర్ణాటకలో కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన తమ ముఖ్యమంత్రితో మాట్లాడి అప్పర్ భద్ర నుండి పరశురాంపుర మీదుగా ఖర్చు లేకుండా బీటీపీకి నీరు తెస్తారా? అని ప్రశ్నించారు. ఇలాంటి దొంగల , దగాకోరు, దుర్మార్గుల పార్టీలో ఉండలేక , ముల్లంగి సోదరుల లాంటివారు చాలా మంది మనపార్టీలోకి చేరుతున్నారన్నారు. ముల్లంగి సోదరులు నారాయణస్వామి, భాస్కరనాయుడు, లింగదహాళ్ సర్పంచ్ లింగన్నల చేరిక సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు దాదాపు 3 వేల మందితో బైక్ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రరెడ్డి ఈ ర్యాలీని ప్రారంభించారు. చంద్రబాబు లాంటి నయవంచన పాలన నుండి విముక్తి పొందాలంటే ఒంట్లో ఓపిక ఉన్నంతవరకు కాదు ఒంట్లో ఊపిరివున్నంతవరకు వైసీపీ గెలుపునకు ,వైఎస్ జగన్ తో ఉండి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.