వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంతి. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా ఇలా ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో పూర్తి చేసుకున్న జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరి నియోజకవర్గంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. జగన్ తన పాదయాత్ర ద్వారా ఏ ప్రాంతంలోకి అడుగుపెట్టినా.. అక్కడి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ వెంట నడిచేందుకు సిద్ధపడుతున్నారు.
ప్రజల మస్యలు పరిష్కారమే ధ్యేయంగా పాదయాత్ర చేస్తున్న జగన్‌కు వృద్ధుల నుంచి చిన్నారుల వరకు వారి వారి సమస్యలను తెలుపుకుంటున్నారు. వృద్ధులయితే తమకు చంద్రబాబు సర్కార్ పింఛన్ ఇవ్వడం లేదని, రైతులు, మహిళలు అయితే చంద్రబాబు నాయుడు 2014లో ఇచ్చిన రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ హామీని ఇప్పటి వరకు అమలు చేయలేదని జగన్‌కు చెప్పి వాపోతున్నారు. మరో పక్క యువత జగన్‌ను కలిసి ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేయని చంద్రబాబు సర్కార్ వైనాన్ని తెలుపుతున్నారు. చిన్నారులు సైతం జగన్‌ను కలిసి తమ పాఠశాలల్లో మౌలిక వసతులు లేవంటూ.. మీ ప్రభుత్వం అధికారం చేపట్టాక మా సమస్యలు కూడా పరిష్కరించాలంటూ వినతి పత్రాలు అందజేస్తున్నారు. ఇలా నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా నాయకుడిగా పేరొందిన జగన్ చెంత చేరేందుకు పలు పార్టీల సీనియర్ నాయకులు ఆసక్తి చూపుతున్నారు.
ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో కాటసాని రాంభూపాలరెడ్డి, కన్నబాబు, యలమంచిలి రవి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మహ్మమద్ ఇక్బాల్, వసంత కృష్ణప్రసాద్, బాపట్ల మాజీ ఎంపీ చిమటా సాంబు, ఇంకా పలువురు వైసీపీలో చేరిన విషయం తెలిసిందే.
తాజాగా, ఈ జాబితాలో కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి కూడా చేరిపోయారు. కాగా, దివంగత నటుడు, మాజీ ముఖ్యమంతరి కుమార్తెగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పురందేశ్వరి 2014 ఎన్నికల్లో రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే, బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వంటి వంటి ప్రతిపాదనలను అమలు చేసి ప్రజలను ఆదుకుంటుందని, ఆ క్రమంలో రాజకీయంగా బలం పుంజుకుని బీజేపీ అధికారంలోకి వస్తుందని భావించిన పురందేశ్వరికి గట్టి షాకే తగిలింది. 2014 తరువాత కేంద్రంలో బీజేపీ వచ్చినా.. ఏపీకి చేసిందేమీ లేకపోవడంతో.. ఏపీలో బీజేపీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. అందులోనూ మొన్నటి వరకు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్న పురందేశ్వరికి కేంద్ర ప్రభుత్వం ఝలక్ ఇస్తూ కన్నా లక్ష్మీ నారాయణకు బాధ్యతలు అప్పచెప్పిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితులన్నిటిని గమనించిన పురందేశ్వరి బీజేపీలో ఉంటే తన రాజకీయ ప్రాముఖ్యతకు విలువ తగ్గుతుందని భావించి పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్‌ను ఫోన్ ద్వారా సంప్రదించినట్టు ఓ సోషల్ మీడియా కథనం పేర్కొంది. ప్రస్తుతం వైఎస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో వైఎస్ జగన్ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్టీఆర్ కుమార్తెగా ఉన్న తనను కూడా జగన్ ఆదరిస్తాడనే ధీమాతో మే నెల చివరి నాటికి జగన్ సమక్షంలో పురందేశ్వరి వైసీపీ తీర్థం పుచ్చుకోనుందని సోషల్ మీడియా కథనం వెల్లడించింది.
ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ సోషల్ మీడియా పేర్కొన్న ఈ కథనంలో నిజమెంతుందన్న విషయానని వైసీపీ వర్గాలు ధృవీకరించాల్సి ఉంది.