నారా చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మోస పూరిత హామీలను నమ్మిన ఏపీ ప్రజలు టీడీపీకి అధికారాన్ని కట్టబెట్టిన విషయం తెలిసిందే. అయితే, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యలు చేపట్టి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా.. హామీలు అమలు చేయడంలో మాత్రం చంద్రబాబు ఇప్పటికీ వాయిదా వేస్తూనే వస్తున్నారు. వీటన్నిటిని గమనించిన ప్రజలు త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకీ బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఆ నేపథ్యంలోనే టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడి ప్రజలు అభివృద్ధిపై నిలదీస్తున్నారు.
ఇలా టీడీపీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, నేతలకు ప్రజల నుంచి చీవాట్లు ఎదురవుతుండటంతో మేల్కొన్న సీఎం చంద్రబాబు ఏపీలో ప్రస్తుతం టీడీపీ పరిస్థితి ఎలా ఉందన్న విషయంపై సర్వే చేయించారట. ఆ క్రమంలో మొదటగా కృష్ణా జిల్లా సర్వే రిపోర్ట్‌ను హుటా హుటిన తెప్పించుకున్న చంద్రబాబుకు పరిశీలనలో మాత్రం షాకింగ్ నిజాలు తెలిశాయట. జిల్లాలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ టీడీపీపై ప్రజలు పెదవి విరుస్తున్నారని, ఐటీ పరిశ్రమలు అంటూ సమావేశాలు నిర్వహిస్తూ కోట్ల రూపాయల నిధులను మంచి నీళ్లలు ఖర్చు పెడుతున్నారని తేలింది. ఏ నియోజకవర్గంలోనూ అభివృద్ధి సరైన స్థాయిలో జరగ లేదని, అందులోనూ పామర్రు నియోజకవర్గంలో మాత్రం అభివృద్ధి శూన్యమని చంద్రబాబు సర్వే రిపోర్టు పేర్కొంది.
ఈ క్రమంలోనే పామర్రు నియోజకవర్గంలో వైసీపీ సీటుపై ఎమ్మెల్యేగా గెలుపొంది టీడీపీలోకి ఫిరాయించిన ఉప్పులేటి కల్పనతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే, పామర్రు నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమన్న విషయం తన సర్వేలో తేలిందని, దీనికి గల కారణాల ఏమిటంటూ ఉప్పులేటి కల్పనపై ప్రశ్నల వర్షం కురిపించారు చంద్రబాబు. అంతేకాకుండా, 2019 ఎన్నికల్లో మీకు ఎమ్మెల్యేగా ఎవరు కావాలనుకుంటున్నారు..? అన్న సెల్‌ఫోన్ సర్వేలో నీకు యాంటీగానే రిజల్ట్ వచ్చిందని చంద్రబాబు తెలపడంతో ఉప్పులేటి కల్పన ఒక్కసారిగా కన్నీరు మున్నీరైందట.
అయితే, 2014 ఎన్నికల్లో పామర్రు అసెంబ్లీ సెగ్మెంట్‌లో టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్యపై వైసీపీ అభ్యర్థిగా ఉప్పులేటి కల్పన పోటీ చేసి గెలుపొంది.. ఆ తరువాత టీడీపీ ప్రలోభాలకు లొంగి అధికార పార్టీలో చేరిన విషయం తెలిసిందే. 2019లో మళ్లీ వర్ల రామయ్యను పోటీ చేయించాలని, అలా కాకుంటే, ఎప్పట్నుంచో టీడీపీని నమ్ముకున్న నేతకు పామర్రు అసెంబ్లీ సీటుపై పోటీ చేసే అవకాశం ఇవ్వాలని సీఎం చంద్రబాబు యోచిస్తున్నారు. ఆ క్రమంలోనే ఉప్పులేటి కల్పనకు యాంటీగా రిజల్ట్‌ను ప్రకటించారన్నది టీడీపీ నేతల లోగుట్ట. మరో పక్క ఇదే విషయంపై ఉప్పులేటి కల్పన తన సన్నిహితుల వద్ద మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు విడుదల చేయకుండానే.. అభివృద్ధి ఎందుకు జరగలేదంటూ తనపై చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించడమేంటని వాపోయిందట. చంద్రబాబు సర్వేలోనూ తనకు వ్యతిరేకంగా రిజల్ట్ రావడాన్ని ఉప్పులేటి కల్పన జీర్ణించుకోలేక పోతోంది.
ఏదేమైనా వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఉప్పులేటి కల్పన పరిస్థితి ప్రస్తుతం మింగలేక, కక్కలేక అన్నట్టు ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.