ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి కన్నుమూశారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో కుమార్తెతో పాటు ఉంటున్న ఆమె గుండెపోటుతో మరణించినట్లు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. యద్దనపూడి సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కాజ గ్రామంలో జన్మించారు. కుటుంబ కథనాలు రాయడంలో ఆమె తనకు తానే సాటి అని నిరూపించుకుని తెలుగునాట సుప్రసిద్ధ రచయిత్రిగా ఖ్యాతి గడించారు. ‘నవలా దేశపు రాణి’గానూ ఆమె ప్రసిద్ధి చెందారు. ఆమె రాసిన అనేక నవలలు.. సినిమాలు, టీవీ సీరియళ్లుగా తెరకెక్కాయి. మీనా, ఆగమనం, ఆరాధన, అగ్నిపూలు, ఆహుతి, అమర హృదయం, రుతువులు నవ్వాయి, కలల కౌగిలి, ప్రేమ పీఠం, బహుమతి, బంగారు కలలు, మౌనతరంగాలు, మౌన పోరాటం, మౌనభాష్యం, వెన్నెల్లో మల్లిక, విజేత, శ్వేత గులాబి, సెక్రటరీ తదితర నవలలు రచించారు. ఆమె రచనల్లో అత్యంత ప్రజాదరణ పొందిన నవల ‘మీనా’. దీని ఆధారంగానే ‘మీనా’ చిత్రం తెరకెక్కింది.
