తెలంగాణ కాంగ్రెస్ నేతలపై పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సుమన్ మాట్లాడారు.కాంగ్రెస్ పార్టీ 2009 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలుచేయలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైతును రాజుగా చేయడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం మహాయజ్ఞం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మొసలికన్నీరు కారుస్తున్నారని అన్నారు. ఇటు తెలంగాణ రాష్ట్రంలో, అటు దేశంలో సీఎం కేసీఆర్ విప్లవం నడుస్తున్నదని.. ఈ విప్లవంలో కాంగ్రెస్ పార్టీ భస్మం కావడం ఖాయమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కాదని, కిసాన్ చంద్రశేఖర్‌రావు అని రైతులు కొనియాడుతున్నారని చెప్పారు .
రైతుబంధు పథకంతో అన్నదాతల్లో విశ్వాసం, భరోసా నింపారని, అక్టోబర్‌లో వచ్చే దసరా పండుగ మే నెలలోనే వచ్చిందని గ్రామగ్రామాన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు . ఇప్పుడు టీఆర్‌ఎస్ అంటే తెలంగాణ రైతు సమితిగా పేరు మారిందని అని సుమన్ వ్యాఖ్యానించారు. రైతులసంక్షేమం కోసం ఏడాదికి ఎకరానికి రూ.8 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తుంటే రైతులు సంతోషిస్తుండగా.. కాంగ్రెస్ పార్టీలో విషాదం అలుముకున్నదని ఎద్దేవా చేశారు .