తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనితీరుకు ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో కేంద్ర ప్రాజెక్టులకు సంబంధించి అన్ని పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు కితాబిచ్చారు. శుక్రవారం తెలంగాణ సచివాలయంలో జరిగిన 11వ ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్ సమీక్ష సమావేశంలో పీఎం కార్యాలయం ప్రత్యేక కార్యదర్శి అరుణ్‌గోయల్, జాయింట్ సెక్రటరీ సోమదత్‌శర్మ పాల్గొన్నారు.
తెలంగాణలో చేపడుతున్న జాతీయ రహదారుల విస్తరణ, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం, హైదరాబాద్ మెట్రోరైల్, సింగరేణికి సంబంధించిన పనులను వారు సమీక్షించారు. కేంద్ర మానిటరింగ్ గ్రూప్ పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న పనులు ఇక్కడ బాగా జరుగుతున్నాయని కేంద్ర అధికారులు ఈ సందర్భంగా ప్రశంసించారు. హైదరాబాద్ మెట్రోరైల్‌కు సంబంధించి 215 ఆస్తుల సేకరణకుగాను 29 ఆస్తులు సేకరించి డిమాలిష్ చేశామని, 186 ఆస్తులు అవార్డ్ స్టేజీలో ఉన్నాయని, జూన్ 15 నాటికి అన్నింటినీ అప్పగిస్తామని సీఎస్ ఎస్కే జోషి పీఎంవో అధికారులకు తెలిపారు. అలాగే మునీరాబాద్-మహబూబ్‌నగర్, మనోహరాబాద్- కొత్తపల్లి, కొవ్వూరు-భద్రాచలం రైల్వే లైన్లకు సంబంధించి భూసేకరణ పనుల పురోగతిని వివరించారు.
జాతీయరహదారులైన సంగారెడ్డి-అకోలా, హైదరాబాద్-మన్నెగూడ, మంచిర్యాల-చంద్రాపూర్, జగిత్యాల-వరంగల్, కోదాడ-ఖమ్మం, సూర్యాపేట- ఖమ్మం, ఖమ్మం-అశ్వారావుపేట ప్యాకేజీలవారీగా త్వరలో పూర్తిచేస్తామని సీఎస్ వివరించారు. ఇందుకోసం అవసరమైన భూసేకరణ కోసం జిల్లా కలెక్టర్లతో నిత్యం సమీక్షిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో రోడ్లు భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, సింగరేణి సీఎండీ శ్రీధర్, హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్, అడిషనల్ పీసీసీఎఫ్ శోభ తదితరులు పాల్గొన్నారు.