జనసేన పార్టీలో కల్లోలం నెలకొంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అంటే అభిమానించే ఫ్యాన్సే..పవన్ తీరునే తీవ్రంగా తప్పుపడుతున్నారు. అదికూడా పవన్ వ్యవహరిస్తున్న తీరు…జనసేన పార్టీ నాయకుడు పార్టీ పరువు తీసేలా చేస్తున్న కామెంట్లు గురించి. జనసేన పార్టీ నాయకుడు, ఆ పార్టీ అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ విషయంలో.
ఎందుకు పవన్ తీరుపై ఫ్యాన్స్ ఫైరవుతున్నారంటే…కర్ణాటక పరిణామాలపై టీవీల్లో జరుగుతున్న చర్చల్లో పాల్గొని.. భారతీయ జనతాపార్టీకి అద్దేపల్లి శ్రీధర్ సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తున్నారు. ఇటీవలి కాలంలో పవన్ బీజేపీపై ఘాటుగా స్పందిస్తుంటే…శ్రీధర్ మాత్రం జనసేన గళం వినిపించడం కాకుండా ఫక్తు బీజేపీ నాయకుడిలా మాట్లాడేస్తున్నారని ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. బీజేపీ నేత అయిన అద్దేపల్లి శ్రీధర్ జనసేనలో చేరగానే అధికార ప్రతినిధి హోదాను పవన్ కట్టబెట్టిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా అప్పటివరకు కష్టపడుతున్న కొందరు నాయకులను పక్కనపెట్టి మరీ పవన్ ఈయనకు పెద్ద పీట వేశారు. ఈ సమయంలోనే పలువురి నుంచి విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు అదే వ్యక్తి ద్వారా పవన్ పార్టీ బుక్ అయిపోతోందని పవన్ ఫ్యాన్స్ వాపోతున్నారు.
మరోవైపు పవన్ తీరుపై కూడా అభిమానులు ఫైర్ అవుతున్నారు. కర్ణాటక పరిణామంపై పవన్ ఎలాంటి ప్రకటనలు చేయలేదు. జనసేన పార్టీ విధానాన్ని పవన్ కల్యాణ్ స్పష్టం చేయలేకపోతుండటాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేని పరిస్థితి ఓ వైపు ఉంటే..మరోవైపు ఇదే అవకాశం అన్నట్లుగా అద్దేపల్లి బీజేపీకి మద్దతు ఇస్తున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం జనసేనకు ఉన్న అస్పష్ట వైఖరిని అవకాశంగా తీసుకొని బీజేపీ పెద్దల దృష్టిలో పడేందుకు అద్దేపల్లి ఏదైనా స్కెచ్ వేశారా అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. పవన్ పార్టీ వైఖరిని ప్రకటించాలని, అద్దేపల్లిని బీజేపీకి మద్దతు ఇచ్చే విషయంలో దూకుడుగా స్పందించకుండా కాస్త అదుపులో ఉంచాల్సిందేనని పవన్ ఫ్యాన్స్ కోరుతున్నారు.