తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలు సమస్యలు దొరకక ఇబ్బందులు పడుతున్నాయని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలు దొరక్కపోవడం ప్రజల్లో ఆదరణ కోల్పోవడం వల్లే వారు విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో గెలుస్తామని కాంగ్రెస్ బీజేపీ కలలు కంటున్నాయని అయితే అవి కల్లలేనని కేటీఆర్ స్పష్టం చేశారు. “ ఏ రాజకీయ పార్టీ అయినా విస్తరించుకోవాలనుకోవడం సహజం. టీఆర్‌ఎస్ గెలుస్తుందని మేం అనుకుంటున్నాం… బీజేపీ, కాంగ్రెస్ గెలుస్తుందని వాళ్లు అనుకుంటున్నారు… అంతిమ నిర్ణేతలు ప్రజలే. ప్రజలు ఎలా నిర్ణయిస్తే అలా. ప్రజల మనసును గెలుచుకోవడం ముఖ్యం“ అని కేటీఆర్ పేర్కొన్నారు.
టీఆర్ఎస్ ఏ పార్టీకి బీ టీం కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. `బీజేపీకి టీఆర్‌ఎస్ ‘బీ’ టీం, ‘సీ’ టీం అంటూ ఏమీ ఉండదు. సీఎం కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీ లకు కొరుకుడు పడకుండా అయ్యారు. రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీలకు చిక్కడు దొరకడు లాగా అయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పంచాయతీ లేకుండా అత్యధిక స్థానాలు గెలుస్తాం“ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
బీజపీ మత రాజకీయాలు తెలంగాణలో పనిచేయవని కేటీఆర్ స్పష్టం చేశారు. “‘హిందుత్వ’ కార్డుకు ఇక్కడ ఛాన్స్ లేదు. కేసీఆర్ కంటే గొప్ప ధార్మిక వాది ఏవరు…? బీజేపీ, వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల కంటే గొప్ప ధార్మిక వాది కేసీఆర్. కేసీఆర్ కంటే యాగాలు , గుళ్లు పెద్ద ఎత్తున కట్టే వారు ఏవరు….? ముస్లిం, హిందూ గొడవలు పెట్టడానికి అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి ఆ సమస్య ఉత్పన్నం కాదు“ అని మంత్రి కేటీఆర్ తెలిపారు.