కర్ణాటక ఎన్నికలతో దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా రాజకీయ వాతావరణ వేడెక్కింది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో పలు సర్వే సంస్థలు చేసిన సర్వేలన్నీ ఒక్కసారిగా తలకిందులయ్యాయి. అయితే, మిగతా పార్టీలకంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ సీట్లు వస్తాయని ఎన్నికలకు ముందు సర్వేలన్నీ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, ఆ సర్వే ఫలితాలను తలకిందులు చేస్తూ ప్రజలు తీర్పునిచ్చారు. బీజేపీ 104, కాంగ్రెస్ 78, జేడీఎస్ 37, బీఎస్‌పీ-1, ఇతరులు-2 అసెంబ్లీ సీట్లను దక్కించుకున్న విషయం తెలిసిందే. బీజేపీ వంద అసెంబ్లీ సీట్ల మార్క్‌ను దాటినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీసింది. దీంతో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన పలు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇలా కర్ణాటక రాజకీయం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అయితే, నవ్యాంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు మాత్రం కర్ణాటకకు భిన్నంగా ఉన్నాయి. అక్కడ పూర్తి అధికారం చేపట్టందుకు చేరువలో ఉన్న బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌తో పలు పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు యత్నిస్తుంటే.. ఏపీలో మాత్రం ప్రలోభాలకు గురి చేయకుండానే ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి అధికార పార్టీ సీనియర్ నేతలతోపాటు పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు చేరేందుకు సిద్ధమవుతున్నారు.
కాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల మధ్య విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా.. ప్రాంత ప్రజలు వారు ఎదుర్కొంటున్న సమస్యలను అర్జీల రూపంలో జగన్‌కు తెలుపుకుంటున్నారు. ఇలా జగన్‌పై ప్రజల్లో ఆదరణతోపాటు నమ్మకం పెరుగుతోంది. మరో పక్క ఇటీవల పలు సర్వే సంస్థలు చేసిన సర్వేల్లోనూ వైఎస్ జగన్‌ను సీఎంగా పేర్కొంటూ ఫలితాలను ప్రకటించాయి.
ఇలా వైఎస్ జగన్‌పై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను గమనించిన ఏపీలోని పలు పార్టీలకు చెందిన సీనియర్ నేతలు వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అలాగే, అధికార టీడీపీ పార్టీకి చెందిన మరో 12 మంది ఎమ్మెల్యేలు కూడా వైసీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. అందులో ప్రథమంగా వినిపిస్తున్న వారి పేర్లు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి కాగా, మరొకరు కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి సాయి ప్రతాప్. పశ్చిమ గోదావరి జిల్లా మాజీ మంత్రి వట్టి వసంతకుమార్. అయితే, ఈ ముగ్గురు కూడాను కాంగ్రెస్ హయాంలో మంత్రులుగా పనిచేసి.. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి తరువాత టీడీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల నడుమ సీఎం చంద్రబాబు టీడీపీలో చేరిన సీనియర్ నాయకులకు ప్రాముఖ్యతను ఇవ్వకపోవడంతో.. అసంతృప్తి చెందిన వారు వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అయితే, నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం మంత్రి స్థాయిలో ఉన్న సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనే స్థాయిలో విభేదాలు తలెత్తాయి. దీంతో ఆదాల ప్రభాకర్‌రెడ్డి తన అనుచరులతో చర్చించి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కడప జిల్లాలో సాయిప్రతాప్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఈ నేపథ్యంలో వీరిద్దరితోపాటు మరో 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలతోపాటు సీనియర్ నేతలు వైఎస్ జగన్‌తో టచ్‌లో ఉన్నారంటూ ఆ సోషల్ మీడియా కథనం పేర్కొంది. ఏదేమైనా త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందన్న వార్త ఆ పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్‌ను నింపుతోంది.