కర్ణాటక ఎన్నికలు హాట్ హాట్‌గా మారిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ మద్ధతుతో తమకు సంపూర్ణ బలం ఉన్నప్పటికీ.. సింగిల్ లార్జెస్ట్ పార్టీ అన్న సాకు చూపి గవర్నర్ ఏకపక్షంగా బీజేపీకి అధికారం అప్పగించడం పట్ల జేడీఎస్-కాంగ్రెస్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గవర్నర్ నిర్ణయంపై ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లిన ఈ రెండు పార్టీలు దేశంలోని ఇతర పార్టీల మద్ధుతుతో పోరాటం చేయాలని భావించాయి. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతో కాంగ్రెస్, జేడీఎస్‌లు సంప్రదింపులు జరుపుతున్నాయి. ఈ క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యూపీ మాజీ సీఎం, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయవతి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కుమారస్వామి ఫోన్ చేశారు.
సహజంగా జాతీయ రాజకీయాలంటే యమ ఆసక్తి చూపించే చంద్రబాబుకు ఇది ఎంతో కలిసి వచ్చే అవకాశం. పైగా ఇటీవల ఆయన బీజేపీపై రగిలిపోతున్నాడు. అవకాశం వస్తే ఎదురుదాడి చేస్తున్నాడు. అంతపగతో రగిలిపోతున్నప్పటికీ బాబు ఎందుకు స్పందించక పోవడం ఆసక్తికరం. పైగా మమతాబెనర్జీ, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయవతి మద్ధతు ప్రకటించినా కూడా బాబు కిక్కురుమనడం లేదు. దీనికి కారణం కేసుల భయం అని తెలుస్తోంది.
సీఎం పీఠం కోసం బీజేపీ చేస్తున్న అనైతిక విధానాలపై బాబు స్పందిస్తే వెంటనే అంతా బాబు వైపు చూస్తారు. ఆయన చేసిన ప్రజాస్వామ్య తప్పిదమైన పార్టీ ఫిరాయింపులు, మంత్రి పదవులు కట్టబెట్టడం అనే ఉదంతాన్ని బయటపెట్టి బాబు నిజస్వరూపాన్ని రోడ్డు పాలు చేస్తారు. వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం మంత్రి పదవులు ఇవ్వడం గురించి సహజంగానే నేషనల్ మీడియా బాబును ఫుట్‌బాల్ ఆడుకుంటుంది. అందుకే బాబు తేలుకుట్టిన దొంగలా ఉన్నారని అంటున్నారు. పగ తీర్చుకోకపోయినా పర్లేదు కానీ పరువు కాపాడుకోవాలని చూస్తున్నట్లు చెప్తున్నారు.