తెలంగాణ రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి ఆదర్శంగా నిలిచారు.రైతులను ఆర్ధికంగా ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం పేరుతో సంవత్సరానికి ఎకరానికి రూ.8వేల చొప్పున పెట్టుబడి సాయం ను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ఈ నెల 10న ప్రారంభమై రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్నది.
అయితే.. కొంతమంది తమకు వచ్చిన రైతు బంధు చెక్కులను తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటే రైతు సమన్వయ సమితులకు విరాళంగా ఇచ్చేస్తూ తమ ఉదారతను చాటుతున్నారు. చెక్కులు వాపస్ ఇస్తున్న వారిలో సామాన్య ప్రజల నుంచి మంత్రులు , నాయకులూ ,ఉద్యోగులు కూడా ఉన్నారు.ఈ క్రమంలోనే ఇవాళ మంత్రి తుమ్మల కూడా తనకు వచ్చిన రైతు బంధు చెక్కును అధికారులకు అందజేశారు.
ఖమ్మం జిల్లాలోని దమ్మపేట మండలం గండుగులపల్లిలో మంత్రి తుమ్మలకి 36 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అయితే రైతు బంధు కింద ఆ భూమికి రూ. 1.45 లక్షలు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా అధికారులు మంత్రికి చెక్కును అందజేయగా.. ఆ చెక్కును మంత్రి తిరిగి అధికారులకు అప్పగించి.. రైతుల సంక్షేమానికి తన చెక్కును ఉపయోగించాల్సిందిగా కోరారు.ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు మంత్రి తుమ్మలను కొనియాడుతున్నారు.నిత్యం ఎంత బిజీగా ఉన్నా వారంలో రెండు రోజులు తన వ్యవసాయ క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలిస్తూ..సంబంధిత వ్యవహారాలను మంత్రి తుమ్మల చూసుకుంటారు.