కర్ణాటక శాసన సభ ఎన్నికల ఫలితాలు ఊహించని రీతిలో వెలువడిన విషయం తెలిసిందే.కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కేపీసీసీ కార్యాలయంలో జాతీయ నేతలు, పార్టీ ఎమ్మెల్యేల సమక్షంలో కంటతడి పెట్టారు. నిన్న (బుధవారం ) కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భేటీలో పలువురు సీనియర్లు సిద్దరామయ్యపై విమర్శలు చేశారు . ఓటమికి సిద్దరామయ్యనే బాధ్యుడని వారు ఆరోపించారు. నొచ్చుకున్న సిద్దరామయ్య కంటతడి పెట్టారు. పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని రాత్రింబవళ్లు కష్టపడ్డానని..అయినా, ఓటమికి బాధ్యుడిని చేస్తూ వ్యాఖ్యానించడం బాధ కలిగించాయని సిద్దూ ఈ సందర్భంగా తన ఆవేదన వ్యక్తం చేశారు.
సిద్దరామయ్యతో కాంగ్రెస్ పార్టీకి ఒరిగిందేమీ లేదని, ఆయన్ను పార్టీ నుంచి దూరం పెట్టాలని మాజీ స్పీకర్ కోళివాద్ తెలిపారు . ‘‘ఈ ఓటమికి సిద్దూనే బాధ్యుడు. కర్ణాటకలో కాంగ్రెస్ ను భ్రష్టు పట్టించాడు. నాపైనే శంకర్‌ను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దించేలా చేశాడు. దాంతో నేను ఓడిపోయా. ఆ స్వతంత్ర ఎమ్మెల్యే ఈ రోజు బీజేపీలో చేరుతున్నాడు. ఈ నేరం సిద్దరామయ్యదే’’ అని ఆరోపించారు. పార్టీ ఓటమికి పూర్తి బాధ్యుడు సిద్దూయేనని కోళివాద్ స్పష్టం చేశారు.