కర్నూల్ జిల్లా తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలో బుధవారం నిర్వహించిన మినీ మహానాడు సభలో తెలుగుతమ్ముళ్ల మధ్య గొడవ జరిగింది. మహానాడు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ఘర్షణ మొదలైంది. సభ జరుగుతుండగా ఆలూరు టీడీపీ ఇంచార్జ్ వీరభద్రగౌడ్, నియోజకవర్గ టీడీపీ మాజీ ఇంచార్జ్ వైకుంఠం మల్లికార్జున చౌదరి వర్గీయుల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
అంతటితో ఆగకుండా ఒకరిపై మరొకవర్గం దూషణకు దిగడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఆవేశానికి లోనైన వైకుంఠం వర్గీయులు దాడికి దిగడంతో పోలీసులు అప్రమత్తమై వెంటనే వారిని సభా ప్రాంగణం నుంచి బయటకు పంపించడంతో, సభకు హజరైన టీడీపీ మహిళా కార్యకర్తలు, ప్రజలు ఇంటిదారి పట్టారు. సభ నుంచి ఎవరూ బయటకు వెళ్లిపోవద్దని మహిళా కార్యకర్తలు, టీడీపీ శ్రేణులను జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆలూరు నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు జక్కిఉల్లా కోరినా ప్రయోజనం లేకపోయింది.