ప్రాజెక్టుల నిర్మాణంలో ఇంజినీర్ల, ఉద్యోగుల విశేష కృషి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకుల సమస్యలపై సీఎం కేసీఆర్ మంత్రి వర్గ ఉపసంఘంతో ప్రగతి భవన్‌లో చర్చించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెవెన్యూ పెరుగుదల అద్భుతంగా ఉందన్నారు. వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మంత్రివర్గ ఉపసంఘం చర్చించిందన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించామన్న సీఎం .. ఉద్యోగుల శ్రమతోనే ప్రభుత్వ పథకాలు విజయవంతమయ్యాయన్నారు.
రెవెన్యూ వసూళ్లలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు . రెవెన్యూ రికార్డులను విజయవంతంతగా ప్రక్షాళన చేశామన్నారు. తెలంగాణ అభివృద్దిలో ఉద్యోగుల పాత్ర మరువలేనిదన్నారు. దేశస్థాయిలో రాష్ట్రానికి ఎంతో గౌవరం దక్కుతోందన్నారు. కేసీఆర్ కిట్ల వల్ల ప్రభుత్వ డాక్టర్లు ఎంతో శ్రమిస్తున్నారని.. బాధ్యత పెరిగిందన్నారు.ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యతన్నారు. జూన్ 2న ఇంటీరియమ్ రిలీఫ్ ప్రకటిస్తామన్నారు. ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. బదిలీల విధివిధానాలపై అజయ్ మిశ్రా అధ్యక్షతన కమిటీ వేశామన్నారు.
పంచాయతీ ఎన్నికల ముందే ఉద్యోగుల బదిలీలు చేపడతామన్నారు. రెండు..మూడు రోజుల్లో పీఆర్సీపై త్రిసభ్య కమిటీ వేస్తామన్నారు. ఆగస్టు 15కు ముందే పీఆర్సీ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించామన్నారు.టీచర్ల ఏకీకృత సర్వీసుల కోసం ప్రభుత్వమే న్యాయ పోరాటం చేస్తుందన్నారు సీఎం కేసీఆర్. అంతేకాదు పది రోజుల్లోనే కారుణ్య నియామకాలు చేపడతామన్నారు.